Begin typing your search above and press return to search.

భారీ రిలీఫ్.. కటింగ్ కు ఓకే చెప్పేసిన హోంశాఖ!

By:  Tupaki Desk   |   3 May 2020 6:10 AM GMT
భారీ రిలీఫ్.. కటింగ్ కు ఓకే చెప్పేసిన హోంశాఖ!
X
కరోనా కారణంగా ఎదురైన ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. వాల్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా ప్రతిఒక్కరూ కరోనా కారణంగా సమస్యలు ఎదుర్కొన్నారు. చెప్పేందుకు సిల్లీగా అనిపించినా.. లాక్ డౌన్ పుణ్యమా అని భారీగా పెరిగిన జుట్టు.. గడ్డంతో పురుష పుంగవులకు ఎదురవుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. సెలూన్లు మూసివేయటం.. క్లోజ్ కాంటాక్టు ఉండటంతో లాక్ డౌన్ వేళ.. వాటిని అనుమతించే అవకాశం ఇప్పట్లో లేదన్న మాట వినిపించింది.

భారీగా పెరిగిన క్రాఫ్ లు.. గడ్డాలతో పురుష పుంగవులు దారుణంగా కనిపించే పరిస్థితి. అదే పనిగా ఉంటున్న తమను తమ జీవిత భాగస్వాములు భరించలేకపోతున్నారని పలువురు మగాళ్లు వాపోయే పరిస్థితి. ఈ సమస్యకు పరిష్కారంగా పలువురు ప్రముఖులు ఇంట్లోనే భార్య చేత కటింగ్ చేయించుకున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఇదే అంశంపై పలువురు ప్రముఖులు సరదాగా స్పందించారు కూడా.

ఇప్పటికే నెలన్నర దాటిన లాక్ డౌన్ ను మరో రెండు వారాల పాటు పొడిగిస్తూ కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో.. సెలూన్లు ఎప్పుడు తెరుస్తారన్న దానిపై పెద్ద ఎత్తున వినతులు వెల్లువెత్తుతున్నాయి. మగాళ్లు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యపై తాజాగా కేంద్ర హోంశాఖ స్పందించింది. సెలూన్లు ఓపెన్ చేసే విషయంపై సానుకూలంగా స్పందించింది.

ఈ నెల నాలుగు నుంచి మొదలయ్యో మూడో విడత లాక్ డౌన్ లో ఆరెంజ్.. గ్రీన్ జోన్లలో సెలూన్లను తెరుచుకోవచ్చని పేర్కొన్నారు. రెడ్ జోన్ లో మాత్రం సెలూన్లను తెరుచుకునే అవకాశం లేదు. తాజాగా అమల్లోకి రానున్న లాక్ డౌన్ లో పలు సంస్థలకు మినహాయింపులు ఇచ్చారు. కేసుల తీవ్రత పెద్దగా లేని అరెంజ్ తో పాటు.. అసలే లేని గ్రీన్ జోన్లలో ఈ కామర్స్ సంస్థలకు సైతం రిలీఫ్ ఇచ్చారు.

ఇప్పటివరకూ నిత్యావసర వస్తువులు మాత్రమే డెలివరీ చేసే సదరు సంస్థలు.. మే నాలుగు తర్వాత నిత్యవసరాలు కాని వాటిని కూడా అమ్ముకునే వీలుందని కేంద్రం స్పష్టం చేసింది. అంతేకాదు.. కంటైన్ మెంట్ ప్రాంతాలు మినహా అన్ని జోన్లలోనూ మద్యాన్ని విక్రయించేందుకు ఓకే చెప్పేశారు. అయితే.. ఇందుకు కొన్ని షరతులు వర్తిస్తాయని. లాక్ డౌన్ మూడోదశలో ఇళ్లల్లో పని చేసే వారి విషయంలోనూ స్థానికంగా ఉండే అసోసియేషన్ల అనుమతితో నిర్ణయం తీసుకోవచ్చని కేంద్రం పేర్కొంది.