Begin typing your search above and press return to search.

లాయర్లను చూసి జడ్జిలు భయపడుతున్నారట

By:  Tupaki Desk   |   22 Sep 2015 6:33 AM GMT
లాయర్లను చూసి జడ్జిలు భయపడుతున్నారట
X
దేశంలోని అత్యుత్తమ రంగాల్లో ఒకటైన న్యాయరంగానికి సంబంధించిన విస్మయకర విషయాన్ని చెప్పుకొచ్చారు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ ఎల్ దత్తు. మద్రాస్ హైకోర్టులో చోటు చేసుకుంటున్న దారుణమైన అంశాల్ని ఆయన ప్రస్తావించటం ఇప్పుడు సంచలనంగా మారింది. కొందరు న్యాయవాదులు చట్టానికి అతీతంగా పని చేస్తున్న తీరు ఆందోళన కలిగిస్తుందని.. జడ్జిలను ఉద్దేశించి కొందరు న్యాయవాదులు తిట్టేయటాన్ని ప్రస్తావించారు.

ప్రదర్శనగా వచ్చి నినాదాలు చేయటం.. తమ కుటుంబ సభ్యుల్ని కోర్టుకు తీసుకొచ్చి ఇబ్బందులు పెట్టటం.. జడ్జిలను తిట్టటం.. పనికిమాలిన ఫిర్యాదులు చేయటం లాంటి వాటిని ప్రస్తావిస్తున్నారు. ఇలాంటి పరిణామాలపై మద్రాస్ హైకోర్టు ప్రధానన్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ తో తాను సుదీర్ఘంగా మాట్లాడానని.. పరిస్థితి మరింత చేయి దాటిపోతుందని.. ఇలాంటి పరిస్థితుల నుంచి న్యాయమూర్తుల్ని రక్షించాల్సిన అవసరం ఉందని ప్రముఖ న్యాయవాది వేణుగోపాల్ పేర్కొనటం గమనార్హం.

తమిళాన్ని కోర్టులో అధికార భాష చేయాలంటూ లాయర్లు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం వారు తరచూ ఆందోళనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కొందరు తమ పరిధుల్ని దాటటం లాంటివి చేస్తున్నారు.

నిజానికి ఇలాంటి పరిస్థితి ఒక్క మద్రాస్ హైకోర్టులో మాత్రమే కాదు.. భావోద్వేగ అంశాలపై పోరాటం జరుగుతున్న ప్రతిచోట జరుగుతున్న తంతే. అయితే.. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ.. లేనిపోని తలనొప్పులు ఎదురవుతాయన్న ఉద్దేశ్యంతో న్యాయవ్యవస్థ చూసీచూడనట్లుగా వ్యవహరించటం ఆందోళనలు చేస్తున్న వారికి మరింత ఊతం ఇచ్చేలా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎంత భావోద్వేగ అంశమైనా సరే.. పరిధి దాటిన న్యాయవాదుల విషయంలో న్యాయమూర్తులు కఠినంగా స్పందిస్తే.. ఇలాంటి ఇబ్బందులే చోటు చేసుకోవన్న సూచన న్యాయవాద వర్గాలు చేస్తున్నాయి. కానీ.. అంతటి సాహసోపేతమైన నిర్ణయాన్ని ఎవరూ తీసుకోలేకపోవటమే అసలు సమస్యగా చెబుతున్నారు. ప్రస్తుతం మద్రాసు హైకోర్టులో న్యాయమూర్తులు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానించిన జస్టిస్ దత్తు.. సమస్యను మద్రాస్ హైకోర్టుకు పరిమితం చేయటం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మద్రాస్ లోనే కాదు.. దేశంలోని పలు హైకోర్టులలో ఇలాంటి వైఖరి ఉందని.. మొత్తంగా వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని సుప్రీం చీఫ్ జస్టిస్ ప్రస్తావించి.. అన్ని రుగ్మతల్ని ప్రస్తావించి ఉంటే బాగుండేదన్న మాట వినిపిస్తోంది. మంచి సంస్కృతిని నాలుగు కాలాల పాటు కొనసాగించాల్సిన అవసరం ఉంది. దాన్ని అడ్డుకునేలా చోటు చేసుకునే అంశాల పట్ల అందరూ కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.