Begin typing your search above and press return to search.

అసలు ఆంధ్రా బ్యాంకు ఎలా స్టార్ట్ చేశారో తెలుసా?

By:  Tupaki Desk   |   31 Aug 2019 4:26 AM GMT
అసలు ఆంధ్రా బ్యాంకు ఎలా స్టార్ట్ చేశారో తెలుసా?
X
ఒక తెలుగోడు స్థాపించిన బ్యాంకును.. తెలుగింటి కోడలు కారణంగా ఖతం పట్టటం ఆసక్తికర అంశంగా చెప్పక తప్పదు. తెలుగువారికి సొంత బ్యాంకు ఉండాలన్న తపనతో స్వాతంత్యోద్యమ నేత.. తన ప్రాంత వాసుల మీద ఉన్న ప్రేమాభిమానాలతో స్థాపించిన తొలి తెలుగు బ్యాంకు తెలుగింటి కోడల కారణంగా మాయం కానుండటం గమనార్హం. ఆంధ్రా బ్యాంకు స్థాపనే ఆసక్తికరంగా చెప్పాలి. ఆంధ్రా బ్యాంకును కృష్ణాజిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య కలకు నిలువెత్తు రూపంగా చెప్పాలి.

మచిలీపట్నంలో పురుడు పోసుకున్న ఈ బ్యాంకు 96 ఏళ్ల వ్యవధిలో వివిధ శాఖలుగా విస్తరించి.. దేశంలోని వివిధ ప్రాంతాల్లో తన శాఖల్ని నెలకొల్పింది. ఆంధ్రోళ్లకు కేరాఫ్ అడ్రస్ అన్నట్లుగా ఉండే ఆంధ్రా బ్యాంకు విషయంలో కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో కనుమరుకానుంది. చరిత్రలో కలిసిపోనుంది. ఆంధ్రా బ్యాంకును యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం కానుంది.

ఇంతకీ.. ఆంధ్రా బ్యాంకును ఎందుకు స్థాపించారు. దాని వెనుక ఉన్న కథేమిటి? అన్న క్వశ్చన్ కు ఆన్సర్ వెతికితే ఆసక్తికరమైన కథ బయటకు వస్తుంది. పశ్చిమగోదావరి జిల్లాలోని గుండుగొలుసులో పేద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన భోగరాజు పట్టాభి సీతారామయ్య మద్రాసులో వైద్య విద్యను పూర్తి చేస్తారు. ఆయన తన ప్రాక్టీస్ ను నాటి బందరు ఇప్పటి మచిలీపట్నంలో ప్రారంభించారు.

ఒక రోజు తన ఇంటి ఎదురుగా ఉన్న వైశ్య సోదరులు ఇద్దరు తమ డబ్బును దాచుకునే విషయంలో గొడవ పడుతుంటారు. వారిద్దరు చివరకు పట్టాబి వారి వద్దకు వచ్చి తమ డబ్బును దాచాలని కోరతారు. అదే సమయంలో రైతులు వ్యవసాయం కోసం పెట్టుబడి దొరక్క ఇబ్బంది పడుతుంటారు. వాళ్లు ఎక్కువ వడ్డీకి అప్పులు చేయటాన్ని పట్టాభి గుర్తిస్తారు.

ఈ నేపథ్యంలో రైతుల కష్టాలు తీర్చేందుకు వీలుగా బ్యాంకును స్థాపించాలని పట్టాభి భావిస్తారు. ఇందులో భాగంగా బందరు పట్టణంలోని పలువురు పుర ప్రముఖుల సాయంతో లక్ష రూపాయిల మూలధనంతో ప్రారంభించారు. లక్ష అంటే ఇప్పుడు చాలా చిన్న మొత్తంగా కనిపించొచ్చు. కానీ.. 1923 ప్రాంతంలో అది చాలా పెద్ద మొత్తంగా చెప్పాలి. ఈ మొత్తం ఎంత పెద్దదన్న విషయాన్ని చెప్పాలంటే.. ఇప్పుడు 10 గ్రాముల బంగారం రూ.40వేలు ఉన్న విషయం తెలిసిందే. అదే 1923లో 10 గ్రాముల బంగారం ఎంతో తెలుసా? అక్షరాల రూ.18 మాత్రమే. బంగారంతో లక్ష రూపాయిల విలువను చెప్పాలంటే దగ్గర దగ్గర 55.5 కేజీల బంగారం మూలధనంగా బ్యాంకును స్టార్ట్ చేశారని చెప్పాలి.

1923 నవంబరు 23న ఆంధ్రా బ్యాంకును రిజిస్టర్ చేయించి.. సరిగ్గా వారం రోజులకే అంటే నవంబరు 28న పట్టాభివారి ఇంటి నుంచే బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభించటం గమనార్హం. అలా ప్రారంభమైన ఆంధ్రా బ్యాంకు అంతకంతకూ పెరుగుతూ ఇప్పుడు దేశ వ్యాప్తంగా 3వేలకు పైగా బ్రాంచులతో వటవృక్షంలా విస్తరించింది. అలాంటి బ్యాంకును ఇప్పుడు మోడీ మాష్టారి ప్రభుత్వం సింఫుల్ గా ఒక నిర్ణయం తీసేసుకొని.. యూనియన్ బ్యాంకులో విలీనం చేసేస్తూ నిర్ణయం తీసుకుంది. తెలుగోడి ఘనచరిత్ర రానున్న తరాల్లో గుర్తు చేసుకోవటానికి వీల్లేని విధంగా చేసిందన్న ఆగ్రహం పలువురి నోట వినిపిస్తోంది.

మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఇప్పుడు అన్ని బ్యాంకులు.. ఖాతాదారులు విరివిగా వినియోగిస్తున్న క్రెడిట్ కార్డులను దేశంలో తొలిసారి ప్రారంభించిన బ్యాంకు ఆంధ్రా బ్యాంకే. అంతటి ఘన వారసత్వం ఉన్న బ్యాంకు ఈ రోజు కనిపించకుండా పోవటం తెలుగువారి బ్యాడ్ లక్ గా.. అన్నింటికి మించిన ఆంధ్రోళ్లకు ఉనికి దెబ్బగా చెప్పక తప్పదు. ఆంధ్రా బ్యాంకు ఎంత పెద్దది అవుతున్నా.. ఇతరప్రాంతాల్లో బ్యాంకును విస్తరించినా.. దాని ఉత్తర ప్రత్యుత్తరాలన్ని తెలుగులోనే సాగాలని సూచన చేసిన బ్యాంకు.. రానున్న రోజుల్లో దాని పేరు కూడా వినిపించకుండా పోనుంది.