Begin typing your search above and press return to search.

పవన్ మాటలు.. స్నేహితుల కే నచ్చలేదు!

By:  Tupaki Desk   |   4 Dec 2019 4:52 PM GMT
పవన్ మాటలు.. స్నేహితుల కే నచ్చలేదు!
X
సార్వత్రిక ఎన్నికల సమయానికి ముందు నుంచినే కమ్యూనిస్టు పార్టీల నేతలతో పవన్ కల్యాణ్ ఎంత సన్నిహితంగా వ్యవహరించారో చెప్పనక్కర్లేదు. ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో కలిసి పోటీ చేశారు పవన్ కల్యాణ్. వీరితో పాటు బీఎస్పీ కూడా పొత్తుతో పోటీకి దిగింది.

ఈ పార్టీలన్నీ కూటమిగా పోటీ చేశాయి. అయితే ఆ పొత్తు ఎవ్వరినీ గట్టెక్కించలేకపోయింది. అన్ని పార్టీలూ కలిసి పోటీ చేసి కూడా అవి సాధించుకున్న సీట్లు ఒక్కటంటే ఒక్కటే! ఈ కూటమికి డిపాజిట్ వచ్చిన నియోజకవర్గాల సంఖ్య కూడా వేళ్ల మీద లెక్క బెట్ట తగినవే!

మరి అలాంటి స్నేహితులు ఉంటే ఎంత లేకపోతే ఎంత అన్నట్టుగా ఉంది పవన్ కల్యాణ్ వైఖరి. ఎన్నికలు అయిపోయాకా వారిని పవన్ పెద్దగా పట్టించుకోవడం లేదు. కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసిన పవన్ కల్యాణ్ తను ఏనాడూ బీజేపీకి దూరం కాలేదని ఇప్పుడు చెబుతూ ఉండటం మరో కామెడీ.

ఆ సంగతలా ఉంటే.. జనసేన అధిపతి తాజా వ్యాఖ్యలు కమ్యూనిస్టులకు మింగుడుపడటం లేదు. బీజేపీ జాతీయాధ్యక్షుడిపై పవన్ కల్యాణ్ చాలా సానుకూల వ్యాఖ్యలు చేశారు. ‘అమిత్ షానే కరెక్ట్..’ అంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల కమ్యూనిస్టు పార్టీ నేత రామకృష్ణ మాట్లాడారు.

అసలు అమిత్ షా ఎందుకు కరెక్టో చెప్పాలంటూ పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ప్రశ్నించారు రామకృష్ణ. రాష్ట్రానికి బీజేపీ ద్రోహం చేసిందని, చేస్తోందని అలాంటి బీజేపీ అధ్యక్షుడిని పవన్ కల్యాణ్ ఎలా పొగుడుతారని రామకృష్ణ ప్రశ్నించారు.

ఇటీవల పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లడం, అక్కడ బీజేపీ నేతలను కలవడం తెలిసిన సంగతి తెలిసిందే.ఈ విషయం మీదా రామకృష్ణ స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కమలం పార్టీ నేతలు పవన్ కు ఏమైనా చెప్పారా.. అంటూ ఆయన ఎద్దేవా చేశారు. మొత్తానికి పవన్ కల్యాణ్ మాటలు.. ఎన్నికల్లో ఆయనతో కలిసి పోటీ చేసిన వారికే మింగుడుపడుతున్నట్టుగా లేవు!