Begin typing your search above and press return to search.

అంబాసిడ‌ర్ కారు ఇక మ‌న‌కు క‌నిపించదు

By:  Tupaki Desk   |   11 Feb 2017 12:00 PM GMT
అంబాసిడ‌ర్ కారు ఇక మ‌న‌కు క‌నిపించదు
X
అంబాసిడ‌ర్‌..ఒకప్పుడు రాజ‌సం ఉట్టిప‌డటానికి చిరునామాగా ఉన్న ఈ కారు ఈ మ‌ధ్య కాలంలో అరుదుగా కూడా రోడ్ల‌పై క‌నిపించ‌డం లేదు. ఇక భ‌విష్య‌త్‌లో కనిపించ‌ద‌నే వార్త వెలువడింది. ఎందుకంటే ఈ కార్ల‌ను త‌యారు చేసే కంపెనీ అయిన హిందుస్తాన్ మోటార్స్ త‌న మాన‌స‌పుత్రిక అయిన అంబాసిడ‌ర్ కారు త‌యారీని ఫ్రెంచ్‌కు చెందిన పెంగ్యూట్ సంస్థ‌కు అమ్మేసిన‌ట్లు తెలుస్తోంది. సీకే బిర్లా సార‌థ్యంలోని హిందుస్తాన్ మోటర్స్ ను ఫ్రెంచ్ సంస్థ‌కు రూ.80 కోట్ల‌కు అమ్మేసిన‌ట్లు స‌మాచారం. ఈ నిధుల‌తో అంబాసిడ‌ర్ ఉద్యోగుల‌కు చెల్లించాల్సిన బ‌కాయిలు, ఇత‌ర వ్యాపారుల‌కు ఉన్న అప్పుల‌ను ముట్టజెప్ప‌నున్న‌ట్లు తెలుస్తోంది. కాగా, గ‌త మూడేళ్లుగా అంబాసిడ‌ర్ కారు త‌యారీని నిలిపివేసిన సంగ‌తి తెలిసిందే.

అంబాసిడ‌ర్ బ్రాండ్ ను హిందుస్తాన్ మోటార్స్ కంపెనీ ఏడు ద‌శాబ్దాల క్రితం భార‌త‌దేశంలో ప్రవేశపెట్టింది. 1980లో భార‌తీయుల్లో మెజార్టీ ఈ వాహ‌నంపై మొగ్గుచూపారు. ప్ర‌స్తుతం ఉన్న‌న్ని బ్రాండ్ల అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో 1960, 1970 ద‌శ‌కాల్లో అయితే రోడ్ల‌పై అంబాసిడ‌ర్ కార్ల‌దే హ‌వా. అంతేకాదు అప్పుడు అంబాసిడ‌ర్ కారు క‌లిగి ఉండ‌టం ఒక క‌ల‌. అయితే మారుతి 800 మ‌న దేశంలోకి అరంగేట్రం చేసిన త‌ర్వాత అంబాసిడ‌ర్ ప్ర‌భావం త‌గ్గిపోయింది. 1980 ద‌శ‌కాల్లో అనేక అడ్వాన్డ్ ఫీచ‌ర్ల‌తో కొత్త కార్లు మార్కెట్‌ను ముంచెత్త‌డంతో అంబాసిడ‌ర్ ఆ స్థాయికి చేరుకోలేక‌పోయింది. 1980లో ఏడాదికి 24,000 కార్లు అమ్ముడుపోగా, 2013-14లో కేవ‌లం 2000 అంబాసిడ‌ర్‌ కార్లు మాత్ర‌మే అమ్మ‌గ‌లిగారు. అదే సంవ‌త్స‌రంలో అంబాసిడ‌ర్ ఉత్ప‌త్తిని నిలిపివేశారు!