Begin typing your search above and press return to search.

ఆస్తులన్ని వదిలేసి వెళుతున్న హిందూ ఫ్యామిలీలు?

By:  Tupaki Desk   |   13 Jun 2016 9:29 AM GMT
ఆస్తులన్ని వదిలేసి వెళుతున్న హిందూ ఫ్యామిలీలు?
X
ఎక్కడైనా ఏదైనా జరిగితే మీడియా ఎంత హడావుడి చేస్తుందో అందరికి తెలిసిందే. అయితే.. దీనికి కొన్ని లెక్కలు ఉన్నాయి. మెజార్టీల విషయంలో ఏదైనా జరిగితే సంయమనంతో వ్యవహరించే మీడియా.. మైనార్టీల విషయంలో మాత్రం చేసే హడావుడి అంతాఇంతా కాదు. ఇక.. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాలు కేంద్రంలో కొలువు తీరితే చాలు.. చిన్న విషయాలకు దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంటాయి. మరింత హడావుడి చేసే మీడియా.. రాజకీయ పార్టీలు అన్ని అందరి విషయంలోనూ ఒకేలా వ్యవహరించాలి.

కానీ.. అలాంటిదేమీ జరగటం లేదన్న వాదన తాజాగా వినిపిస్తోంది. దశాబ్దాల క్రితం కాశ్శీర్ లోయలో హిందూ పండిట్లను వేలాదిగా తరిమి కొట్టిన పరిస్థితి. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని విలువైన ఆస్తుల్ని.. పుట్టి పెరిగిన ఊళ్లను వదిలేసి ప్రాణభయంతో పరుగులు తీసిన పరిస్థితి. దీనిపై దేశ వ్యాప్తంగా ఉన్న మీడియా కానీ.. పార్టీలు కానీ ఎంతలా గళం విప్పాయో చరిత్రను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. చరిత్రదాకా ఎందుకు వర్తమానం కూడా ఇలానే ఉందన్న మాట వినిపిస్తోంది. ఉత్తరప్రదేశ్ లోని కైరానా పట్టణానికి చెందిన వందలాది హిందువులు సామూహికంగా ఆ ఊరిని వదిలేసి వెళ్లిపోవటం ఇప్పుడు ఆందోళన రేకెత్తించే అంశం.

ఈ వ్యవహారం గురించి మీడియాలో ఎంత వెతికినా వార్తలు రాని పరిస్థితి. చాలా తక్కువగా కవర్ అవుతున్న ఈ యవ్వారం వెనుక అసలేం జరిగింది? అక్కడేం జరుగుతుందన్న విషయాన్ని మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు బీజేపీ నడుం బిగించింది. నిజానికి బీజేపీ సైతం అలెర్ట్ అయ్యింది కేంద్రమంత్రి.. బీజేపీ ఏంపీ హుకుం సింగ్ చేసిన ఆరోపణలతోనే. ఇప్పటివరకూ కైరానా పట్టణం నుంచి 346 మంది హిందూ కుటుంబాలు తరలివెళ్లినట్లుగా ఆయన ఆరోపిస్తున్నారు.

ఈ పట్టణంలో మరో కాశ్శీర్ లా మారిందంటూ ఆయన గళం విప్పటంతో పెద్ద కలకలమే రేగింది. అయినా.. మీడియాలో ఆయన మాటలకు లభించిన ప్రాధాన్యత అంతంతమాత్రమే. ఆయన మాటల ప్రకారం.. ఆ ఊళ్లో మతపరమైన హత్యలు కనీసం పది వరకూ జరిగాయని.. దీనికి సంబంధించిన వాస్తవాలు వెలికి తీయాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. కేంద్రమంత్రి వర్యుల నోటి నుంచే ఇలాంటి మాటలు రావటంతో బీజేపీ అలెర్ట్ కావటమే కాదు.. అసలు విషయం తెలుసుకునేందుకు తొమ్మిది మందితో కూడిన కమిటీ ఈ నెల 16న కైరానాలో పర్యటించాలని.. నిజాల్ని నిగ్గు తీయాలని నిర్ణయించారు. ఇంతకీ కైరానాలో ఏం జరిగింది? బీజేపీ బృందం వెళ్లి పర్యటిస్తే కానీ.. అసలు విషయాలు బయటకు రావేమో..? కేంద్రమంత్రి గొంతు చించుకునే వరకూ మీడియా కూడా ఈ విషయం మీద పెద్దగా ఫోకస్ ఎందుకు పెట్టనట్లు..?