Begin typing your search above and press return to search.

హిందూపురం వైసీపీలో క‌ట్ట‌లు తెగిన ఆగ్ర‌హం.. సొంత నేత‌కు వ్య‌తిరేకంగా బంద్‌

By:  Tupaki Desk   |   30 Oct 2022 3:46 AM GMT
హిందూపురం వైసీపీలో క‌ట్ట‌లు తెగిన ఆగ్ర‌హం.. సొంత నేత‌కు వ్య‌తిరేకంగా బంద్‌
X
ఎక్క‌డైనా.. ఏ పార్టీలో అయినా సొంత నేత అంటే గౌర‌వం ఉంటుంది. పైగా పార్టీ అధినేతకు న‌చ్చిన‌, ఆయ‌న మెచ్చిన నాయ‌కుడు అయితే కార్య‌క‌ర్త‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డ‌తారు. ఆయ‌న చెప్పిందే వేదంగా పాటిస్తారు. కానీ, అదేంటో కానీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ పోలీసు అధికారి, పైగా సీఎం జ‌గ‌న్‌కు అత్యంత కావాల్సిన నేత‌గా గుర్తింపు తెచ్చుకున్న మహ్మద్ ఇక్బాల్ కు వ్యతిరేకంగా వైసీపీ నేతలు ఏకమయ్యారు. ప్రశాంతంగా ఉన్న హిందూపురంలో ఇక్బాల్‌ హత్యా రాజకీయాలను ప్రేరేపిస్తున్నారని నేతలు మండిపడ్డారు. ఈ నేప‌థ్యంలో ఇక్బాల్ గోబ్యాక్ నినాదంతో వ‌చ్చే సోమవారం హిందూపురం బంద్‌కు పిలుపునిచ్చారు. ఈలోగా అధిష్టానం స్పందించి ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని , లేక‌పోతే బంద్‌ను పాటిస్తామ‌ని హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం.

ఏం జ‌రిగింది?

ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్కు, స్థానికంగా ఉన్న వైసీపీ నాయ‌కుల‌కు కొంత కాలంగా ప‌డ‌డం లేదు. అస‌లు ఆయ‌న‌కు టికెట్ ఇవ్వ‌డాన్నే గ‌త ఎన్నిక‌ల్లో చాలా మంది వ్య‌తిరేకించారు. ఆది నుంచి పార్టీని డెవ‌ల‌ప్ చేసిన న‌వీన్ నిశ్చ‌ల్‌కు ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. అయితే.. జ‌గ‌న్ మాత్రం న‌వీన్‌ను ప‌క్క‌న పెట్టి మ‌రీ ఇక్బాల్‌కు అవ‌కాశం ఇచ్చారు. ఆయ‌న ఓడిపోయారు. త‌ర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు. దీంతో స్థానికంగా నాయ‌కులు మ‌రింత ర‌గిలిపోతున్నారు. ఎవ‌రినీ క‌లుపుకొని పోడ‌ని, త‌నుచెప్పిందే వినాల‌ని ఇక్బాల్ హుకుం జారీ చేస్తారని ఇక్క‌డి వైసీపీ నాయ‌కులు కొన్నాళ్లుగా గ‌రంగ‌రంగా ఉన్నారు.

ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల వైసీపీ నేత రామ‌కృష్నారెడ్డి హ‌త్య‌కు కావ‌డంతో ఇక్బాల్కు వ్యతిరేకంగా హిందూపురంలో అధికార పార్టీ నేతలు మూడు వర్గాలుగా విడిపోయారు. దీనిలో రెండు వర్గాలు ఎమ్మెల్సీకి పూర్తిగా వ్యతిరేకంగా కార్యక్రమాలు, సమావేశాలు, ప్రకటనలు చేస్తున్నారు. హత్యారాజకీయాలు చేస్తూ ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో చిచ్చుపెడుతూ, స్థానికేతరుడైన ఎమ్మెల్సీని హిందూపురంలో అడుగుపెట్టనీయరాదని నేతలు తీర్మానించారు. స్వంత పార్టీ నేతలపైనే అక్రమ కేసులు పెట్టిస్తున్న వైనాన్ని.. చాలా కాలంగా వ్యతిరేకిస్తున్న ఆ పార్టీ నేతలు తాజాగా మ‌రింత‌ బలం పుంజుకున్నారు.

ఆ నియోజక వర్గంలో ఇప్పటి వరకు ఇక్బాల్కు వ్యతిరేకంగా రెండు వర్గాలు ఉండగా, తాజాగా హత్యారాజకీయాలను వ్యతిరేకిస్తూ మ‌రో వ‌ర్గం ఏర్ప‌డింది. నియోజకవర్గ వ్యాప్తంగా స్వంత పార్టీ వైసీపీ నేతలపై ఎమ్మెల్సీ, ఆయన వర్గం కార్యకర్తల దాడులు, అరాచకాలను ఎప్ప‌టిక‌ప్పుడు అధిష్టానానికి చేర‌వేస్తున్నార‌ని తెలిపారు. అయినా. ఆయ‌న‌ను హెచ్చ‌రించ‌డం లేద‌ని, ఇక‌, ఇప్పుడు ఆయ‌న‌ను నియోజ‌క‌వ‌ర్గం నుంచి పంపిచేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.