Begin typing your search above and press return to search.

హిందూపురంలో అధికారులపై టీడీపీ నేతల జులుం?

By:  Tupaki Desk   |   28 March 2017 7:32 AM GMT
హిందూపురంలో అధికారులపై టీడీపీ నేతల జులుం?
X
విజయవాడలో రవాణా శాఖ కమిషనర్‌ పై దాడి ఘటన మరువక ముందే హిందూపురం మున్సిపల్‌ కమిషనర్‌ ను టీడీపీ నాయకులు దూషించడం వివాదాస్పదమైంది. కొంతకాలంగా కమిషనర్‌ విశ్వనాథ్.. చైర్‌ పర్సన్‌ లక్ష్మి - ఆమె భర్త నాగరాజు మధ్య అంతర్యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వార్షిక బడ్జెట్‌ నేపథ్యంలో మరోసారి గొడవ ముదిరింది. కమిషనర్ నేతృత్వంలో అధికారులు బడ్జెట్ రూపొందించి దాన్ని చైర్‌ పర్సన్‌ పరిశీలన కోసం పంపించారు. దానిపై ఆమె సంతకాలు చేయకుండా పక్కన పడేశారు. దీంతో గడువు ముగుస్తున్నా బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోయారు. ఈ సంగతి ఎమ్మెల్యే బాలకృష్ణ వరకు వెళ్లడంతో ఆయన దీనిపై దృష్టి పెట్టారు. గొడవ లేకుండా బడ్జెట్ పని పూర్తయ్యేలా చూడాలని బాలకృష్ణ తన రాజకీయ - అధికార పీఏలు కృష్ణమూర్తి - వీరయ్యలను సయోధ్య కుదిర్చేందుకు పంపించారు.

దీంతో వారు చైర్‌ పర్సన్ లక్ష్మి - వైస్‌ చైర్మన్ జేపీకే రాము - కౌన్సిలర్లతో విడివిడిగా చర్చంచి బడ్జెట్‌ నిర్వహించేందుకు కమిషనర్‌, అధికారులతో మాట్లాడదామని సూచించారు. అయితే ఇందుకు చైర్‌ పర్సన్ - పలువురు కౌన్సిలర్లు అంగీకరించలేదు. తాము కమిషనర్‌ తో సమావేశమయ్యే ప్రసక్తే లేదని, ఏదైనా ఉంటే ఎమ్మెల్యే బాలకృష్ణతో మాట్లాడతామని తెగేసి చెప్పారు. వెంటనే రంగంలోకి దిగిన బాలకృష్ణ వారితో ఫోన్‌ లో మాట్లాడారు. బడ్జెట్‌ సమావేశం నిర్వహించాలని - కమిషనర్‌ విషయం తాను వచ్చి మాట్లాడతానని చెప్పారు. ఆయన ఆదేశాల మేరకు చైర్‌ పర్సన్ - కమిషనర్‌ - కౌన్సిలర్లు వివిధ శాఖల అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్‌ పై చైర్‌ పర్సన్‌ - వైస్‌ చైర్మన్‌ - కొందరు కౌన్సిలర్లు ధ్వజమెత్తారు. పాలకవర్గం మాటకు కమిషనర్‌ ఏమాత్రం విలువ ఇవ్వలేదని, అలాంటప్పుడు ఇక పాలకమండలి ఎందుకని, కమిషనరే ఖద్దరు బట్టలు వేసుకుని పాలించాలని మండిపడ్డారు. ఏకవచనంతో మాట్లాడుతూ కమిషనర్ పై అందరూ మూకుమ్మడిగా మాటలు దాడిచేసినట్లుగా అక్కడున్నవారు చెబుతున్నారు. దీంతో కమిషనర్‌.. తన పరిధిలో తాను పనిచేస్తానని చెప్పి సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/