Begin typing your search above and press return to search.

సొంత ఇలాకాలోనే బాల‌య్య ప‌రువు గోవిందా

By:  Tupaki Desk   |   1 Feb 2017 5:12 AM GMT
సొంత ఇలాకాలోనే బాల‌య్య ప‌రువు గోవిందా
X
తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఎన్టీఆర్ త‌న‌యుడు - సినీ న‌టుడు బాల‌కృష్ణ కొత్త త‌ల‌నొప్పిని ఎదుర్కొంటున్న‌ట్లు తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో ఆయన వ్యక్తిగత కార్యదర్శి శేఖర్ తీరుపై పార్టీ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. గత ఎన్నికల్లో విజయం సాధించిన బాలకృష్ణ తాను స్థానికంగా ఉండడం వీలుకాదని చెప్పి పార్టీ వ్యవహారాలు - కార్యకర్తల అవసరాలు చూసేందుకు చిత్తూరు జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి కనుమూరి శేఖర్‌ ను వ్యక్తిగత కార్యదర్శిగా నియమించుకున్నారు. అంతేగాక నియోజకవర్గం పార్టీ బాధ్యతలను కూడా అప్పచెప్పారు. అయితే పిఏ శేఖర్ అంతాతానై వ్యవహరిస్తూ దశాబ్ధాల కాలంగా టీడీపీకి అండగా నిలిచిన సీనియర్లను సైతం విస్మరిస్తున్నారన్న ఆరోపణలు గత ఏడాదిగా వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే బాలకృష్ణ రెండు - మూడు నెలలకు ఒకసారి హిందూపురం వచ్చి ఒకటి - రెండు రోజులు ఉంటూ వెళ్ళిపోతుండటంతో పిఏ శేఖర్ స‌ర్వం తానే అయిన వ్యవహరిస్తున్నారని పార్టీలోని అసంతృప్తివాదులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యేలు సిసి వెంకట్రాముడు - అబ్ధుల్‌ ఘనీకి సైతం ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా పోయింది. దళారీలను తన వద్ద పెట్టుకుని పీఏ శేఖర్ కొత్త రాజ‌కీయాల‌కు తెర లేపాడ‌ని ఆరోపిస్తున్నారు.

దశాబ్ధాల కాలంగా పార్టీలో కష్టనష్టాలకు గురవుతున్న వారిని లెక్కచేయకుండా చిలమత్తూరు - లేపాక్షి - హిందూపురం మున్సిపాలిటీల పరిధిలో సామంత రాజులుగా కొందరిని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు తెలియకుండా వ్యక్తిగత కార్యదర్శి శేఖర్ ప్రోత్సహిస్తూ పార్టీని నాశనం చేస్తున్నారని తాజాగా లేపాక్షి మండల టీడీపీ నేత‌లు కొందరు ఆందోళన వెలిబుచ్చారు. రెండురోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకట్రాముడు - టీడీపీ నేత అంబికా లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో హిందూపురం రూరల్ మండలంలో జరిగిన అసంతృప్తుల సమావేశంలో కూడా శేఖర్ వైఖరిని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు దుయ్యబట్టారు. శేఖర్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే బాలకృష్ణ ఇక్కడి పరిస్థితులను అవగతం చేసుకోకుండా శేఖర్‌ కు పెద్దపీట వేస్తున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హిందూపురం రూరల్ - లేపాక్షి మండలాల్లో టిడిపి అసమ్మతి సమావేశాలు సాగగా పార్టీ సీనియర్ నాయకులు - స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హాజరు కావడం టిడిపి కంచుకోట అయిన హిందూపురంలో దుమారం రేపుతోంది. దీనికి తోడు చిలమత్తూరు మండలంలో ఫిబ్రవరి 5వతేదీ అసమ్మతి వర్గీయుల సమావేశాన్ని పెద్దఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.పార్టీ, ఎమ్మెల్యే బాలకృష్ణ పట్ల తమకు ఎలాంటి అసంతృప్తి లేదని, అయితే స్థానికేతరుడైన పీఏ శేఖర్ లంచగొండిగా మారి పార్టీ ప్రతిష్ట దిగజారుస్తున్నారని మాజీ ఎమ్మెల్యే - అసమ్మతి నాయకులు ఆరోపిస్తున్నారు. కనుమూరి శేఖర్‌ను తప్పించకపోతే తాను ఆమరణ నిరాహారదీక్షకు కూడా సిద్ధమని మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకట్రాముడు ప్రతినబూనారు. తెలుగుదేశం పార్టీ - ఎన్టీఆర్ అంటే తనకు ప్రాణమని, బాలకృష్ణ కూడా వాస్తవాలను అర్థం చేసుకుని శేఖర్‌ ను ఇప్పటికైనా దూరం పెట్టాలని సీసీ స్పష్టం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/