Begin typing your search above and press return to search.

బాల‌య్య రాజీనామా చేయాల‌ని మ‌ళ్లీ డిమాండ్లు!

By:  Tupaki Desk   |   5 Sep 2017 1:10 PM GMT
బాల‌య్య రాజీనామా చేయాల‌ని మ‌ళ్లీ డిమాండ్లు!
X
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే,టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు బావ‌మ‌రిది నందమూరి బాలకృష్ణకు తీవ్ర ప‌రాభ‌వం ఎదురైంది. ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న అనంతపురం జిల్లా హిందూపురం నియోజ‌క‌వ‌ర్గంలో గ‌తంలో నిర‌స‌న‌లు వినిపించ‌గా తాజాగా అవి తారాస్థాయికి చేరాయి. ఏకంగా రాజీనామా కోసం డిమాండ్లు తెర‌మీద‌కు వ‌చ్చాయి. నియోజ‌క‌వ‌ర్గంలో రెండు రోజుల పాటు ప‌ర్య‌టించేందుకు వ‌చ్చిన ఎమ్మెల్యే బాల‌కృష్ణను ప‌ద‌వి వీడాల‌ని నినదించారు. హిందూపురంలోని సి.వెంకటాపురం - ఓబుళాపురం - గలిబిపల్లి గ్రామాల్లో రోడ్ల సమస్య తీవ్రంగా ఉంది. సీసీ రోడ్లు కూడా లేకపోవడంతో వానాకాలం అడుగుతీసి అడుగు వేయాలంటేనే ఇబ్బందిగా మారింది.

ఈనేపథ్యంలో చాలా రోజుల తర్వాత హిందూపురం వస్తున్న ఎమ్మెల్యే బాలకృష్ణకు తమ సమస్యలు విన్నవించుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు సిద్ధమయ్యారు. లేపాక్షి నుంచి గలిబిపల్లి క్రాస్‌ కు రాగానే స్థానికులంతా ఎమ్మెల్యే బాల‌కృష్ణ వాహనాన్ని అడ్డుకున్నారు. తమ గ్రామంలో రోడ్లు లేక నడిచేందుకు కూడా ఇబ్బందిగా మారిందనీ - రోడ్ల సమస్య గురించి అనేక మార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. స్పందించిన బాలకృష్ణ అధికారులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం బాలకృష్ణ వాహనం బిసలమానేపల్లికి చేరుకోగానే వెంకటాపురం - ఓబుళాపురం - బిసలమానేపల్లి గ్రామ ప్రజలుఅడ్డుకున్నారు. బిసలమానేల్లి నుంచి వెంటాపురం - ఓబుళాపురం గ్రామాలకు రహదారి లేదన్న విషయం చెప్పాలని భావించారు. కానీ బాలకృష్ణ వారితో మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లి పోయారు. దీంతో ఆగ్రహించిన ప్రజలు ఎమ్మెల్యే వైఖరిని నిరసనగా రాస్తారోకో చేశారు. ''ఎమ్మెల్యే బాలకృష్ణ డౌన్‌..డౌన్‌...ప్రజా సమస్యలు పట్టని ఎమ్మెల్యే రాజీనామా చేయాలి' అంటూ నినదించారు. తమ సమస్యకు పరిష్కారం చూపే వరకూ కదిలేది లేదని రోడ్డుపైనే భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో రాకపోకలకు స్తంభించాయి. వెంటనే స్పందించిన పోలీసులు ఆందోళనకారులకు సర్ది చెప్పి రాస్తారోకోను విరమింపజేశారు.

కాగా, సొంత నియోజ‌క‌వ‌ర్గ‌ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు ప్రారంభోత్స‌వాలు - శంకుస్థాప‌న‌లు చేశారు. వాహనదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఆటోనగర్‌ సమీపంలో కోటి 50లక్షల రూపాయ‌ల‌తో నూతనంగా నిర్మించిన ప్రాంతీయ రవాణా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం రూ.20కోట్లతో నిర్మించే మార్కెట్‌ యార్డ్‌ నిర్మాణానికి భూమిపూజ చేశారు.