Begin typing your search above and press return to search.

బాలయ్యకు ఓటేసినందుకు సిగ్గుపడుతున్నారట!!

By:  Tupaki Desk   |   31 Jan 2016 9:00 AM GMT
బాలయ్యకు ఓటేసినందుకు సిగ్గుపడుతున్నారట!!
X
సినిమాల్లో లాగే ఒక్కోసారి రాజకీయాల్లోనూ కష్టకాలం వస్తుంది.. మహామహా నేతలకే తప్పదు ఇలాంటి పరిస్థితి. అంతా బాగుంది అనుకున్న సమయంలో వైరి వర్గం దారుణమైన కామెంట్లు చేసి పరువు తీయొచ్చు... లేదంటే బలం పెంచుకుందామనుకుంటే వ్యతిరేకుల బలం పెరగావచ్చు. ఇప్పుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు కూడా ఇంతవరకు అనుకోని రీతిలో తొలిసారి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. అసలు ఆయనకు ఓటేయడమే తప్పని... అందుకు తాము సిగ్గుపడుతున్నామని కొందరు అనడంతో బాలకృష్ణ తెగ బాధపడుతున్నారట. హిందూపురం అభివృద్ధి కోసం మంత్రులు, అధికారులను కలిసి నిధులు తెచ్చి పనులు చేయిస్తుంటే... నీటి ఎద్దడి నివారించడానికి నానా ప్రయత్నాలు చేస్తుంటే తన వ్యతిరేక వర్గం వారు ఇలా తీవ్రమైన కామెంట్లు చేసి అవమానించడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారట.

నిజానికి సినీ నటుడైనప్పటికీ సమయం చేసుకుని మరీ బాలయ్య హిందూపురం నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడుతున్నారు. అయితే... తాజాగా బాలకృష్ణకు వ్యతిరేకంగా ప్రెస్‌ మీట్ పెట్టి మరీ ఫైర్ అయ్యారు స్థానిక పారిశ్రామిక సంఘం నేతలు. కార్మికుల సమస్యలను బాలకృష్ణ అస్సలు పట్టించుకోవడం లేదని తూముకుంట పారిశ్రామిక సంఘం అధ్యక్షుడు రవికుమార్ నిప్పులు చెరిగారు. బాలకృష్ణకు ఓటేసినందుకు తామంతా సిగ్గుపడుతున్నామని ఆయన మండిపడ్డారు.

తూముకుంట పారిశ్రామిక వాడలో మొత్తం 93 ఫ్యాక్టరీలు ఉండగా… యాజమాన్యాలు తరచు కార్మికులపై కేసులు పెట్టిస్తున్నాయన్నది ఆరోపణ. వేతనాలు పెంచాల్సిందిగా కోరినందుకు 11మంది కార్మికులపై తాజాగా కేసులు పెట్టించారు. వీరు బాలకృష్ణ దృష్టికి విషయం తీసుకెళ్లినా పట్టించుకోలేదట. దీంతో కార్మికసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ కార్మికుల సమస్యలపై స్పందించకపోవడం ఏమిటని ఓపీడీఆర్ సంఘం నేతలు రవికుమార్ - శ్రీనివాసులు - వెంకట్రామిరెడ్డి తదితరులు ప్రెస్‌మీట్‌లో ప్రశ్నించారు.

ఇప్పటి వరకు బాలకృష్ణ ప్రత్యక్ష రాజకీయ ప్రత్యర్థులు కూడా ఆయనపై ఈ స్థాయిలో విమర్శలు చేయలేదు. బాలయ్య పీఏపై మాత్రం చాలాసార్లు ఆరోపణలు వచ్చినా అనంతపురంలో కాంగ్రెస్ కానీ, వైసీపీ నేతలు కానీ ఎవరూ ఇంతవరకు బాలయ్యను మాత్రం పల్లెత్తు మాటనడం లేదు. పైగా బయటకు చెప్పకున్నా అంతర్గత సంభాషణల్లో అభివృద్ధి పరంగా బాలకృష్ణ పడుతున్న కష్టాన్ని మెచ్చుకుంటున్నారు కూడా. అలాంటి సమయంలో డైరెక్టుగా బాలయ్యను టార్గెట్ చేసి విమర్శించడం చర్చనీయాంశమైంది.