Begin typing your search above and press return to search.

తమిళనాట మళ్లీ మొదలైన హిందీ వివాదం !

By:  Tupaki Desk   |   24 Aug 2020 12:45 PM IST
తమిళనాట మళ్లీ మొదలైన హిందీ వివాదం !
X
తమిళనాడులో మళ్లీ హిందీ భాష వివాదాన్ని రాజేసింది. ఆయుష్మాన్‌ భారత్‌ కార్యదర్శి రాజేష్‌ కోట్చే తీరుపై తమిళ పార్టీలు, సంఘాలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం హిందీ రాదన్న కారణంగా సీఐఎస్ ‌ఎఫ్‌ అధికారి డీఎంకే ఎంపీ కనిమొళిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో తమిళ డాక్టర్లను అవమానించేలా ఆయుష్మాన్‌ భారత్‌ కార్యదర్శి రాజేష్‌ కోట్చే వ్యవహరించిన తీరు తమిళనాట ఆగ్రహాన్ని రేపింది. తమకు హిందీ రాదని, ఆంగ్లంలో ప్రసంగించాలని తమిళ డాక్టర్లు విజ్ఞప్తి చేశారు. హిందీ రాకుంటే బయటకు వెళ్లాలని రాజేష్‌ కొట్చే హెచ్చరించడాన్ని తమిళులు తీవ్ర అవమానంగా భావిస్తున్నారు. ముఖ్యంగా మొదటి నుండి తమిళులకి ప్రాంతీయ భాష అంటే ఎక్కువ ఇష్టం.

రాజేష్ ‌పై తమిళనాడు నేతలు, తమిళాభిమానులు మండి పడుతున్నారు. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ఎండీఎంకే నేత వైగో, ఎంపీ కనిమొళి, తమిళనాడు కాంగ్రెస్‌ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి, తమిళ మానిల కాంగ్రెస్‌ అధ్యక్షుడు, ఎంపీ జీకే వాసన్, డీఎండీకే అధినేత విజయకాంత్‌ దీనిపై స్పందించారు. ఆంగ్లం రాని వ్యక్తిని కార్యదర్శిగా ఎలా నియమించారని ప్రశ్నించారు. ఇంకెంత కాలం తమిళుల్ని అవమానిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై చర్యలకు కేంద్రానికి సిఫారసు చేయాలని పట్టుబట్టారు. డీఎంకే ఎంపీ కనిమొళి, ధర్మపురి ఎంపీ సెంథిల్‌ కుమార్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సినీ రచయిత వైరముత్తు సైతం ఖండించారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకునే చూస్తామని మంత్రి సెల్లూరురాజు అన్నారు.