Begin typing your search above and press return to search.

మనసున్న బిచ్చగాళ్లు.. అడుక్కున్నదంతా దానం

By:  Tupaki Desk   |   6 April 2020 3:46 AM GMT
మనసున్న బిచ్చగాళ్లు.. అడుక్కున్నదంతా దానం
X
కష్టమంతా వారికే తెలుసు.. ఆకలి విలువ వారికి బాగా తెలుసు.. కాలం కలిసి రాకపోవడం.. పరిస్థితులు దారిద్ర్యానికి దారి తీశాయి. కానీ వారికి మనసు ఒకటి ఉంటుంది.. వారికి మానవత్వం అనేది వారికి ఉంటుంది. అది ప్రతిసారి ఎక్కడో ఓ చోట నిరూపితమైంది. ప్రకృతి విపత్తులోనూ.. ఎవరైనా ఆపదలో ఉన్న సమయంలో బయట పడుతూనే ఉంది. తాజాగా ప్రస్తుతం లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉపాధి కోల్పోయి.. పని లేక పస్తులుంటున్నా పేదలను ఓ ఇద్దరు భిక్షగాళ్లు ఆదుకున్నారు. వారు యాచించిన దానిలో కొంత సహాయం చేసి గొప్ప మనసు చాటుకున్నారు.

కరోనాను క‌ట్టడి చేయ‌డానికి దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించిన సంగ‌తి తెలిసిందే. ఈ సమయంలో ఉపాధి కోల్పోయి.. కూలీనాలీ లేక కష్టాలు పడుతున్న పేదలను ఆదుకునేందుకు పెద్ద మనషులు తమకు తోచినంత సహాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ఇద్దరు యాచకులు తమకు ఉన్నంతలో సహాయం చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. పేదల ఆకలి తీర్చేందుకు ముందుకు వచ్చారు. త‌మ వ‌ద్ద ఉన్న డ‌బ్బుతో బియ్యం, పప్పులు దానం చేసి మానవత్వం చాటుకున్నారు.

వారే నేపాల్‌ చెందిన నేపాలి బాబా, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన రత్నం. వారిద్దరు ఏళ్ల నుంచి హిమాచల్ ప్రదేశ్ లోని కులులో భిక్షమెత్తుకుంటూ జీవిస్తున్నారు. వీరిద్దరూ స్నేహితులు. ఇప్పుడు లాక్‌డౌన్విధించడంతో ఆహారం లేక ఇబ్బంది పడుతున్న వారి కోసం తమ వద్ద ఉన్న దానిలో నుంచి కొంత దానం చేశారు. కులులో పేద‌ల ఆక‌లి తీర్చడానికి ప‌ని చేస్తున్న అన్నపూర్ణ అనే స్వచ్ఛంద సంస్థకు 50 కిలోల బియ్యం, 50 కిలోల గోధుమపిండి, 10 కిలోల పప్పు దానం చేశారు. ఈ విషయం ఆ సంస్థ ప్రతినిధులు మీడియాకు తెలపడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ వార్త వైరలైంది. కొందరు కోట్లు కూడా రూపాయి విదిల్చకుండా ఉన్న వారికి భిక్షగాళ్లు బుద్ధి చెప్పారని ప్రజలు పేర్కొంటున్నారు. ఉన్నంతలో సహాయం చేస్తే మనసుకు సంతృప్తి ఉండడంతో పాటు ఇతరుల కడుపు నింపుతుందని చెబుతున్నారు. ఆ భిక్షగాళ్లను సోషల్‌ మీడియాలో అభినందనలు తెలుపుతున్నారు.