Begin typing your search above and press return to search.

పెద్దన్న సీటుకు తుది పోటీ వారిద్దరి మధ్యనేనా?

By:  Tupaki Desk   |   21 Feb 2016 9:03 AM GMT
పెద్దన్న సీటుకు తుది పోటీ వారిద్దరి మధ్యనేనా?
X
మన దేశ ప్రధానిని ఎన్నుకునే విధానానికి.. అమెరికాలో అధ్యక్షుడి ఎన్నికకు మధ్య వ్యత్యాసం చాలానే ఉంటుంది. అమెరికాలో అధ్యక్షుడి పేరు మీదనే ఎన్నికలు జరుగతాయి. మన దగ్గర మెజార్టీ సాధించిన పార్టీని చెందిన నేతను అధినేతగా ఎన్నుకుంటారు. ఈ వ్యత్యాసంతో పాటు.. మరో పెద్ద తేడా ఏమిటంటే.. ఎన్నికల బరిలో నిలిచేందుకు అమెరికాలోని మెజార్టీ ప్రాంతాల్లో తమ బలాన్ని నిరూపించుకునే వారికే తుది పోటీలో పార్టీ తరఫున పోటీ చేసే వీలుంది. అంటే.. అమెరికా అధ్యక్ష స్థానానికి జరిగే ఎన్నికల్లో పోటీ చేయటానికి ముందు.. సదరు వ్యక్తి మెజార్టీ రాష్ట్రాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. అప్పుడే పార్టీలో జరిగే పోటీ స్థాయి దాటి.. తమ రాజకీయ ప్రత్యర్థితో పోటీ పడతారు.

ఇక.. ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ తరఫున డొనాల్డ్ ట్రంప్ తో సహా పలువురు పోటీ పడుతుంటే.. డెమొక్రటిక్ ల తరఫున హిల్లరీ క్లింటన్ తో పాటు.. మరికొందరితో పోటీ పడుతున్నారు. తాజాగా వెలువడిన ఫలితాల్ని పరిశీలిస్తే.. రిపబ్లిక్ పార్టీ తరఫున వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ట్రంప్.. డెమొక్రటిక్ ల తరఫున హిల్లరీ క్లింటర్ మధ్యనే తుదిపోరు జరిగే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.

తాజాగా జరిగిన ఎన్నికల్లో సౌత్ కరోలినాలో డొనాల్డ్ ట్రంప్ భారీ విజయం సాధించారు. ఇది మామూలు విషయం కాదు. మాజీ అధ్యక్షుడు బుష్ ఫ్యామిలీకి ఇక్కడ విపరీతమైన పట్టు ఉంది. అలాంటి చోట ట్రంప్ కు భారీ అధిక్యం రావటంతో అధ్యక్ష స్థానానికి పోటీ చేయాలని తపించిన జేబ్ బుష్ రిపబ్లికన్ రేసు నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇక.. హిల్లరీ సైతం అధిక్యంలో కొనసాగుతోంది. న్యూ హ్యాంప్ షైర్ ప్రైమరీలో ఓడిన హిల్లరీ.. అంతలోనే పుంజుకొని తాజాగా నెవెడా ప్రైమరీలో విజయం సాధించారు. తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రిపబ్లికన్ తరఫున ట్రంప్.. డెమొక్రటిక్ ల తరఫున హిల్లరీ బరిలోకి దిగే వీలుందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.