Begin typing your search above and press return to search.

అమెరికా అధ్య‌క్ష పీఠంపై హిల్ల‌రీ ఖాయం..!

By:  Tupaki Desk   |   19 July 2016 6:47 AM GMT
అమెరికా అధ్య‌క్ష పీఠంపై హిల్ల‌రీ ఖాయం..!
X
అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో వినూత్న వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. ఈ పోటీలో రియల్ ఎస్టేట్ టైకూన్ డొనాల్డ్ ట్రంప్ - మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సతీమణి హిల్లరీ క్లింటన్‌ మ‌ధ్య పోటీ తీవ్ర‌స్థాయిలో ఉంది. త‌న నోటి దురుసుతో ఇప్ప‌టి వ‌ర‌కు లీడ్‌ లో ఉన్న ట్రంప్ ఒక్క‌సారిగా వెన‌క్కి వెళ్లిపోయిన‌ట్టు తాజా స‌ర్వేలు - సంఘ‌ట‌న‌లు స్ప‌ష్టం చేస్తున్నాయి. ట్రంప్‌ కు వ్య‌తిరేకంగా నిన్న దేశ వ్యాప్తంగా అనేక మంది మ‌హిళ‌లు న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేయ‌డం కూడా ఆయ‌న‌కు మైన‌స్ అయి కూర్చుంది. మ‌రో ముఖ్య విష‌యం ఏంటంటే.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన ట్రంప్ త‌న ఆధిప‌త్యాన్ని పెంచుకోవ‌డం కోసం ఇత‌ర దేశాల నుంచి వ‌స్తున్న వారిపై క‌ఠిన ఆంక్ష‌లు విధిస్తాన‌ని - ముఖ్యంగా చైనా - భార‌త్‌ ల నుంచి వ‌చ్చి అమెరికాలో ఉద్యోగాలు కొట్టేస్తున్న వారి నుంచి తిరిగి ఆయా ఉద్యోగాలు లాగేసుకుంటాన‌ని ప్ర‌క‌టించాడు.

అంతేకాకుండా తాను అధికారంలోకి వస్తే... వలస విధానంలో సమూలంగా మార్పులు చేస్తాన‌ని ప్ర‌క‌టించాడు. ఇవేవీ ఆయ‌న‌కు మైలేజీని ఇవ్వ‌క‌పోగా.. పెద్ద‌ మైన‌స్ అయ్యాయి. అదేవిధంగా ట్రంప్ వ్యాఖ్య‌లు ఒక్కోసారి ఆయ‌న‌ను - దేశాన్ని కూడా ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. ఉగ్ర‌వాదం విష‌యంపై మాట్లాడుతూ.. ముస్లింల‌పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశాడు. దీనికి సాక్షాత్తూ అధ్య‌క్షుడు ఒబామా రంగంలోకి దిగి వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది.

దీంతో అధ్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో ఒకానొక స‌మ‌యంలో భారీ మెజారిటీ సొంతం చేసుకున్న ట్రంప్ రానురాను ప్ర‌జ‌ల్లో ఛీత్కారం చ‌విచూస్తున్నాడ‌నే చెప్పాలి. అమెరికాలో ఆదేశ పౌరుల‌తో పాటు చైనా - భార‌త్ - పాకిస్థాన్‌ - బంగ్లాదేశ్‌ ల నుంచి వెళ్లి స్థిర‌ప‌డిన వాళ్లు కూడా ల‌క్ష‌ల్లోనే ఉన్నారు. దీంతో ఈ ఎన్నిక‌ల్లో అధ్య‌క్షుడు కావాల‌నుకునే వారికి వీరి మ‌ద్ద‌తు ఎంతైనా అవ‌స‌రం ఉంది. వీరి నుంచి ఇప్పుడు ట్రంప్‌ కు ఎదురుగాలి భారీగా వీస్తోంది.

ఇక‌, హిల్ల‌రీ విష‌యానికి వ‌చ్చేస‌రికి.. ఈమె ఇప్ప‌టికే రాజ‌కీయంగా దేశంలో ప్ర‌తి ఒక్క‌రికీ ప‌రిచ‌య‌మే. ముఖ్యంగా వివిధ దేశాల నుంచి అమెరికాకు వెళ్లి స్థిర‌ప‌డిన వారికి హిల్ల‌రీ మ‌రింత ప‌రిచ‌య‌స్తురాలు. ఎంద‌కంటే గ‌తంలో ఆమె విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న‌ప్పుడు వివిధ దేశాల‌కు సంబంధించిన వ‌ల‌స విధానాలను దాదాపు స‌ర‌ళీక‌రించారు. ఈ విష‌యంలో ఆమె ఇప్పుడు తాజాగా ఎలాంటి ప్ర‌క‌ట‌న‌లూ చేయ‌డం లేదు. ముఖ్యంగా వివాదాస్ప‌దంగా మాట్లాడ‌డం లేదు.

ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె అభ్య‌ర్థిత్వానికి అడ్డంకిగా మారిన ఈ మెయిల్ కేసులోనూ ఆమె క‌డిగిన ముత్యంలా బ‌య‌ట ప‌డ్డారు. దీంతో ప్ర‌జ‌లు ఇప్పుడు ఆమెకే బ్ర‌హ్మర‌థం ప‌డుతున్నారు. ముఖ్యంగా ఎన్నారైలతో పాటు వివిధ దేశాలకు చెందిన వారంతా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. దీంతో అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఆమె దూసుకుపోవ‌డం ఆ పీఠాన్ని ద‌క్కించుకోవ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. తాజా స‌ర్వేల్లో ట్రంప్ క‌న్నా 4% ఆమె మార్కులు ఎక్కువ కొట్టేశారు కూడా.