Begin typing your search above and press return to search.

అమ్మ వాళ్లకు టికెట్లు ఇస్తారా?

By:  Tupaki Desk   |   19 Sept 2016 1:28 PM IST
అమ్మ వాళ్లకు టికెట్లు ఇస్తారా?
X
ఎన్నికలు ఏవైనా వాటికి సంబంధించి అభ్యర్థుల్ని ఎంపిక చేసే విషయంలో అన్నాడీఎంకే అధినేత్రి.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తీరు కాస్త భిన్నంగా ఉంటుంది. ఆ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న నేతలు అప్లికేషన్లు పెట్టుకోవాలని చెప్పిన అమ్మ.. ఆ తర్వాత ఇంటర్వ్యూలు నిర్వహించి మరీ అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయటం తెలిసిందే.

తాజాగా తమిళనాడులో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆసక్తి ఉన్న వారంతా ఈ నెల 16 నుంచి అప్లికేషన్లు పెట్టుకోవాలంటూ అమ్మ పిలుపునిచ్చారు. దీంతో.. కార్పొరేషన్.. జిల్లా పంచాయితీ కౌన్సిలర్.. యూనియర్ కౌన్సిలర్.. పంచాయితీ కౌన్సిలర్ ఇలా అన్ని పదవులకు సంబంధించి ఆసక్తి ఉన్న అభ్యర్థులంతా పార్టీ టికెట్ కోసం దరఖాస్తు పెట్టుకోవటంలో బిజీబిజీ అయిపోయారు.

ఇదిలా ఉంటే.. తమకు కూడా టికెట్లు కేటాయించాలంటూ ముగ్గురు హిజ్రాలు ఇప్పుడు తెర మీదకు రావటం ఆసక్తికరంగా మారింది. చెన్నై నగరానికి చెందిన ముగ్గురు హిజ్రాలు సుధ.. నూరి.. భారతిలు దరఖాస్తు చేసుకున్నారు. చెన్నై కార్పొరేషన్ లోని 40వ డివిజన్ ఆర్కే నగర్ కు సుధ.. 109వ డివిజన్ అయిన థౌజండ్ లైట్స్ కు నూరి.. 74వ డివిజన్ అయిన మదురై సౌత్ కు భారతిలు అప్లికేషన్లు పెట్టుకున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం ఇవ్వాలని సుధ కోరారు. అయితే.. ఆ సమయంలో ఆమెకు టికెట్ కేటాయించలేదు. అంతకు ముందు 2014లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన భారతికి ఈసారైనా అమ్మ టికెట్ ఇస్తుందా? అన్నది ప్రశ్నగా మారింది.