Begin typing your search above and press return to search.

వైసీపీ ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే ... అనపర్తిలో ప్రమాణాల రాజకీయం , హైటెంక్షన్ !

By:  Tupaki Desk   |   23 Dec 2020 2:20 PM IST
వైసీపీ ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే ... అనపర్తిలో ప్రమాణాల రాజకీయం , హైటెంక్షన్ !
X
అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో అక్కడి రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అనపర్తి ఎమ్మెల్యేపై మాజీ ఎమ్మెల్యే అవినీతి ఆరోపణలు చేశారు. అనపర్తి ఎమ్మెల్యేపై మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మైనింగ్‌ తో సహా పలు అక్రమాలు ఉన్నాయన్నారు. సమాచార హక్కు ద్వారా సేకరించిన ఆధారాలు ఉన్నాయన్నారు. దీనిపై ఎమ్మెల్యే స్పందించి బిక్కవోలు లక్ష్మీగణపతి ఆలయంలో ప్రమాణం చేసి నిజాయితీని తేల్చుకుందామని సవాల్ విసిరారు. ప్రమాణానికి తాను సిద్ధమేనన్న నల్లమిల్లి, ఎమ్మెల్యే బహిరంగ చర్చకు రావాలన్నారు. నేతలు చేసుకుంటున్న అవినీతి ఆరోపణలు నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారాయి.

ఇద్దరు నేతలు తమ భార్యలతో వెళ్లి ఇవాళ బిక్కవోలు లక్ష్మీగణపతి ఆలయంలో ప్రమాణం చేయాలని నిర్ణయించారు. అనపర్తిలో నేతల సవాళ్లతో పోలీసులు ఒక్కసారిగా అప్రమత్త మయ్యారు. ముందస్తు చర్యల్లో భాగంగా భారీగా పోలీసులను మోహరించారు. అనపర్తి మండలం రామవరంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నివాసం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. 144 సెక్షన్ విధించారు.. పోలీసు చట్టం 30 అమల్లోకి తెచ్చారు. రెండు మండలాల్లో బందోబస్తు పెంచడంతో పాటూ వైఎస్సార్‌సీపీ, టీడీపీ నేతల్ని గృహ నిర్భందం చేశారు. ఇరువర్గాల నాయకులు గుడికి వస్తుండటంతో వారి వెంట కేవలం ఐదుగురు వ్యక్తులను రావడానికి పోలీసులు అనుమతిస్తున్నట్టు ప్రకటించారు.

మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వైసిపి తాజా ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుని అవినీతి చిట్టాను బయటపెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజా ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సేకరించిన 200 ఎకరాల్లో అక్రమ మైనింగ్ చేసి 400 కోట్లు దోచుకునేందుకు ప్రయత్నం చేశారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు గుప్పించారు. దీనికి సమాధానంగా వైసిపి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హయాంలో కలెక్షన్ కింగ్ లు ఏ విధంగా దోపిడీ చేశారో తనకు తెలుసన్నారు . అవినీతి చరిత్ర నల్లమిల్లి రామకృష్ణా రెడ్డిదే అన్నారు. అన్ని ఆధారాలతో బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రమాణం చేస్తానని, నల్లమిల్లి కి సవాల్ చేశారు. దీంతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సైతం తాను కూడా తన భార్యతో కలిసి సత్య ప్రమాణానికి రెడీ అన్నారు. ఇద్దరు నేతలు బిక్కవోలు గణపతి ఆలయంలో భగవంతుడి మీద ప్రమాణాలు చేయడానికి సిద్ధమయ్యారు. టిడిపి వైసిపి నేతలు ఇద్దరూ తగ్గకపోవడంతో అనపర్తి, బిక్కవోలు లో ఉద్రిక్త వాతావరణ నెలకొంది.

ఈరోజు మధ్యాహ్నం 2. 30 నిమిషాలకు ముహూర్తం పెట్టుకున్న నేపథ్యంలో వైసిపి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి, నల్లమిల్లి గణపతి ఆలయానికి వస్తారా లేదా అన్నది ఆసక్తికర అంశం గా మారింది. ఒకవేళ వస్తే ఉద్రిక్త వాతావరణం నెలకొంటుందని, వారిని రాకుండా అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. లేదంటే వారికి ఆంక్షలతో కూడిన అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు గా తెలుస్తుంది. వాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకున్నట్టుగా 23న బిక్కవోలు లక్ష్మి గణపతి ఆలయంలో సత్యప్రమాణం చేస్తారా , లేదా అనేది వేచి చూడాల్సిందే.