Begin typing your search above and press return to search.

ఐపీఎల్.. బౌండరీలు, సిక్సర్ల ధమాకాలో ఎవరెక్కడో తెలుసా?

By:  Tupaki Desk   |   17 March 2022 12:32 PM GMT
ఐపీఎల్.. బౌండరీలు, సిక్సర్ల ధమాకాలో ఎవరెక్కడో తెలుసా?
X
రెండేళ్లుగా కొవిడ్ కారణంగా నిర్వహణ ఇబ్బందులు ఎదుర్కొన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఈసారి మాత్రం అదేమీ లేకుండా సాఫీగా సాగేలా కనిపిస్తోంది. కొవిడ్ దాదాపు తగ్గడం, వ్యాక్సినేషన్ ముమ్మరంగా జరగడంతో లీగ్ నిర్వహణకు ఆటంకాలు కనిపించడం లేదు. దీంతో స్వదేశంలో మళ్లీ నాటి లీగ్ కళ కనిపించనుంది.

కాగా బౌండరీల మోతకు, సిక్సర్ల హోరుకు వేదిక లీగ్. నాలుగైదు షాట్లు కొట్టినా..రాహుల్ తెవాతియాలా హీరో లు అయినవారెందరో..? అంతేకాదు.. లీగ్ లో ప్రదర్శనతో టీమిండియా తలుపుతట్టిన క్రికెటర్లు ఇంకెందరో? విదేశీ జట్లలోనూ ఐపీఎల్ తో క్లిక్ అయిన క్రికెటర్లు బోలెడు మంది.. కాగా, ఐపీఎల్ అంటేనే ఫోర్లు, సిక్సర్లు అని మనం చెప్పుకున్నాం కదా..? అలాంటి బౌండరీల మోత మోగించేందుకు మళ్లస్తోంది లీగ్.

ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే లీగ్ 15 ఎడిషన్. దీంతో పాటు జట్ల సంఖ్య 8 నుంచి 10కి పెరిగింది. చాన్నాళ్లుగా చూసిచూసి మొహం మెత్తిన జట్ల స్వరూపం ఈసారి మారిపోయింది. ముగ్గురు, నలుగురు కీలక ఆటగాళ్లు తప్ప అన్ని జట్లలో అందరూ మారారు. కాగా, లీగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటివరకు ఎవరెక్కువ బౌండరీలు, సిక్సర్లు కొట్టారో చూద్దామా?

టాప్ 5 లో రోహిత్

భారత జాతీయ జట్టులోనే కాక ఐపీఎల్‌లోనూ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ. అందుకే అతడు హిట్‌మ్యాన్‌ అయ్యాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్లలోనూ రోహిత్ ఒకడు. ఈ జాబితాలో ప్రస్తుతం మూడో స్థానంలో నిలిచాడు.

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (6,283) పరుగులతో అందరికన్నా ముందుండగా.. శిఖర్‌ ధావన్‌ (5,784), రోహిత్‌ (5,611) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఇక ఈ ముగ్గురూ ఐపీఎల్‌లో అత్యధిక బౌండరీలు బాదిన బ్యాట్స్‌మెన్‌గా టాప్‌-5 జాబితాలో ఉండగా, బౌండరీలతో పాటు, అత్యధిక సిక్సులు సాధించిన టాప్‌-5 బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో కూడా రోహిత్‌ చోటు దక్కించుకోవటం విశేషం.

ధావన్‌: ఐపీఎల్‌లో అత్యధిక బౌండరీలు బాదిన బ్యాట్స్‌మెన్‌ జాబితాలో ధావన్‌ నంబర్‌ వన్‌గా కొనసాగుతున్నాడు. 192 మ్యాచ్‌లలో 4,567 బంతులను ఎదుర్కొని 5,784 పరుగులు చేశాడు. అందులో 654 ఫోర్లు, 124 సిక్సర్లు కొట్టాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మాజీ సారథి విరాట్‌ కోహ్లీ తర్వాతి స్థానంలో నిలిచాడు. అతడు 207 మ్యాచ్‌ల్లో 4,835 బంతులు ఎదుర్కొని 6,283 పరుగులు చేశాడు. అందులో 546 ఫోర్లు, 210 సిక్సర్లు ఉన్నాయి.

సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా ఉండి ఇప్పుడు దిల్లీ జట్టుకు తరలిపోయిన డేవిడ్‌ వార్నర్‌ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. అతడు 150 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడి.. 3,893 బంతులు ఎదుర్కొని.. 5,449 పరుగులు చేశాడు. 525 బౌండరీలు, 201 సిక్సర్లు సాధించాడు. ఈ జాబితాలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ మాజీ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా నాలుగో స్థానంలో నిలిచాడు.

అతడు మొత్తం 205 మ్యాచ్‌ల్లో 4,402 బంతులు ఎదుర్కొని 5,528 పరుగులు చేశాడు. అతడు 506 బౌండరీలు, 203 సిక్సర్లు సాధించాడు. ఐపీఎల్‌లోనే అత్యంత విజయవంతమైన సారథిగా రోహిత్‌కు గొప్ప రికార్డు ఉంది. అతడు 213 మ్యాచ్‌లు ఆడి.. 4,303 బంతులు ఎదుర్కొని 5,611 పరుగులు చేశాడు. అందులో 491 ఫోర్లు, 227 సిక్సర్లను నమోదు చేశాడు.

సిక్సర్ల వీరులు వేరే..

ఇక ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్ల వీరుల జాబితాలో వెస్టిండీస్ లెజెండ్‌ క్రిస్‌గేల్‌ అందరికన్నా ముందున్నాడు. అతడిని ఇప్పట్లో అందుకోవడం ఎవరికైనా కష్టమనే చెప్పొచ్చు. ఎందుకంటే గేల్ 142 మ్యాచ్‌లు ఆడి 3,333 బంతులు ఎదుర్కొని 4,965 పరుగులు చేశాడు. అందులో 405 బౌండరీలు, 357 సిక్సర్లు సాధించడం విశేషం.

గతేడాది వరకూ ఆర్సీబీలో కీలక బ్యాట్స్‌మన్‌గా ఆడిన ఏబీ డివిలియర్స్‌ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. 184 మ్యాచ్‌ల్లో 3,403 బంతులు ఎదుర్కొని 5,162 పరుగులు చేశాడు. అందులో 413 ఫోర్లు, 251 సిక్సర్లను కొట్టాడు. ఐపీఎల్‌లో భారత్‌ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన రెండో బ్యాట్స్‌మన్‌గా, మొత్తంగా నాలుగో బ్యాట్స్‌మన్‌గా నిలిచిన ఆటగాడు చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ.

మొత్తం 220 మ్యాచ్‌లు ఆడి 3,494 బంతులు ఎదుర్కొని 4,746 పరుగులు చేశాడు. అందులో 325 బౌండరీలు, 219 సిక్సర్లు ఉన్నాయి. ఇక ఈ జాబితాలో ముంబయి ఇండియన్స్‌ స్టార్‌ హిట్టర్‌ కీరణ్‌ పొలార్డ్‌ ఐదో స్థానంలో నిలిచాడు. అతడు చాలా సీజన్లుగా ఆ జట్టుతోనే కొనసాగుతూ అత్యంత కీలక విదేశీ ఆటగాడిగా పేరుతెచ్చుకున్నాడు. మొత్తం 178 మ్యాచ్‌లు ఆడిన పొలార్డ్‌ 2,182 బంతులు ఎదుర్కొని 3,268 పరుగులు చేశాడు. అందులో 212 ఫోర్లు, 214 సిక్సర్లు సాధించాడు.