Begin typing your search above and press return to search.

88 ఏళ్ల రికార్డ్ ఒక్కరోజులో బద్దలైపోయింది...

By:  Tupaki Desk   |   25 Sep 2015 6:14 AM GMT
88 ఏళ్ల రికార్డ్ ఒక్కరోజులో బద్దలైపోయింది...
X
గురువారం.. తెలుగు రాష్ట్రాల్లో చాలాచోట్ల ప్రజలు తెగ ఇబ్బంది పడ్డారు... ''అబ్బా ఈ వేడిని తట్టుకోలేకపోతున్నాం.." అంటూ చెమటలు కక్కారు. ఫ్యాన్ ల స్పీడు పెంచారు.. గ్లాసుల మీద గ్లాసులు మంచినీళ్లు తాగారు. నెత్తికి రుమాళ్లు కట్టుకున్నారు. ఇది వర్షాకాలమా వేసవి కాలమా అని తిట్టుకున్నారు. ఇంతకీ దీనికి అసలు కారణం తెలుసా....? 88 సంవత్సరాల తరువాత నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత కారణంగా ఈ ఇబ్బందులన్నీ వచ్చిపడ్డాయి. ఉక్కబోతతో ప్రజలు గుక్కబట్టాల్సివచ్చింది.

ఈ సెప్టెంబర్ నెలలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా సెప్టెంబరులో ఉష్ణోగ్రతలు సగటున 31 నుంచి 33 డిగ్రీలుగా ఉంటుంది. 1927లో మాత్రం 36.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ - రామగుండం - రెంటచింతల సహా పలు ప్రాంతాల్లో 88 ఏళ్ల నాటి ఆ రికార్డు బద్దలైపోయింది. హైదరాబాదులో 36.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ లెక్కలు చెబుతున్నాయి.

ఈ ఏడాది టెంపరేచర్ రికార్డులు ఇప్పటికే కొన్ని బద్ధలవగా తాజాగా 1927 నాటి రికార్డు కనుమరుగై కొత్త అధిక ఉష్ణోగ్రత రికార్డవడం ఆందోళనకరమే. పెరుగుతున్న భూతాపం... కాలుష్యం... కర్బన ఉద్గారాలు వంటి కారణాలతో ప్రజలు రోజురోజుకీ అధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కోవాల్సి వస్తోంది.