Begin typing your search above and press return to search.

ఏపీలో వింత కేసు... పింఛన్ల కోసం వితంతువులయ్యారా?

By:  Tupaki Desk   |   10 Sept 2020 9:00 AM IST
ఏపీలో వింత కేసు... పింఛన్ల కోసం వితంతువులయ్యారా?
X
సామాజిక పింఛన్ల పంపిణీ ఇప్పుడు ప్రభుత్వాలకు తప్పనిసరిగా మారిన వ్యవహారం. ఏ ప్రభుత్వం అయినా సామాజిక పింఛన్లను ఇబ్బడిముబ్బడిగానే పెంచుకుంటూ వెళ్లక తప్పని పరిస్థితి ఉందని కూడా చెప్పాలి. అదే సమయంలో సమాజంలోని ఆయా వర్గాలు ప్రభుత్వ దన్నుతో ఇబ్బంది లేని జీవితం గడపడం కూడా ప్రస్తావించదగ్గదే. ఇక సంక్షేమమే ప్రధాన అజెండాగా ఏపీలో అధికారం చేపట్టిన వైసీపీ సర్కారు... సామాజిక పింఛన్లతో పాటు చాలా వర్గాలకు నేరుగానే నగదు బదిలీ చేస్తోంది. ఇతర పథకాల మాటెలా ఉన్నా... సామాజిక పింఛన్ల పంపిణీకి సంబంధించి ఇప్పుడు ఏపీ హైకోర్టుకు ఓ కొత్త తరహా కేసు వచ్చి పడింది. అదేమిటంటే... రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన కొందరు మహిళలు... తమ భర్తలు బతికే ఉన్నా... కేవలం వితంతు పింఛన్ల కోసం తమ భర్తలు చనిపోయినట్టుగా చెప్పుకుని పింఛన్ పొందుతున్నారట.

కేవలం పింఛన్ కోసమే భర్తలు చనిపోయారంటూ సదరు మహిళలు పింఛన్లు పొందుతున్నారంటే నిజంగానే... ఈ కేసు వింత కేసే కదా. అయితే ఈ విషయంలో కోర్టుకెక్కింది పింఛన్లు ఇస్తున్న ప్రభుత్వమో, అధికారులో కాదు. మొన్నటి దాకా వితంతు పింఛన్ అందుకుంటూ.... ఇటీవలే ఆ జాబితా నుంచి పేర్లు గల్లంతైన మహిళలే ఇప్పుడు కోర్టును ఆశ్రయించారు. ఇలా కోర్టు మెట్లెక్కింది ఒకరో, ఇద్దరో కాదు... ఏకంగా 175 మంది మహిళలు తమ పింఛన్లు నిలిచిపోయాయని కోర్టుకు మొరపెట్టుకున్నారు. ఇక వీరంతా కూడా భర్తలు బతికుండగానే వితంతు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా పింఛన్లు పొందుతున్నారని స్వయంగా ఏపీ ప్రభుత్వమే కోర్టుకు తెలిపింది. దీంతో ఈ కేసు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఇలా భర్తలు బతికుండగానే వితంతు పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడం ఏపీలోనే కాకుండా యావత్తు భారత దేశంలో జరగనే జరగదని హైకోర్టు ధర్మాసనం అబిప్రాయపడింది. అంతేెకాకుండా భర్తలు బతికుండగానే తాము వితంతువులమని, తమ భర్తలు చనిపోయారని భారత మహిళలు చెప్పుకోరని, భారత వివాహ వ్యవస్థ ఎంతో గొప్పదని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. అదే సమయంలో ఎటువంటి విచారణ లేకుండా, కనీసం నోటీస్ కూడా జారీ చేయకుండా పింఛన్లు నిలిపివేయటం సహజ న్యాయసూత్రాలకు వ్యతిరేకమని హైకోర్టు అభిప్రాయపడింది. 15 రోజుల్లోగా నిలిపివేసిన పింఛన్లన్నింటినీ వెంటనే పునరుద్ధరించాలని .. భవిష్యత్ లో కూడా ఈ పెన్షన్లను కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా భర్తలు బతికుండగా వితంతు పింఛన్లు తీసుకుంటున్నారని ప్రభుత్వం, తాము అలా చేయలేదంటూ పిటిషనర్లు వాదించడంతో ఈ కేసు హాట్ టాపిక్ గా మారింది.