Begin typing your search above and press return to search.

ఆ ఎమ్మెల్యేలపై సిబిఐ విచారణ ఎందుకు చేయకూడదు ..హైకోర్టు !

By:  Tupaki Desk   |   20 May 2020 12:11 PM GMT
ఆ ఎమ్మెల్యేలపై సిబిఐ విచారణ ఎందుకు చేయకూడదు ..హైకోర్టు !
X
రాష్ట్రంలో మహమ్మారి తీవ్రత పెరుగుతున్న కీలక సమయంలో లాక్ డౌన్ ఆంక్షలను ఏకంగా ప్రజా ప్రతినిధులే ఉల్లంఘించడంపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లాక్ డౌన్ ఉల్లంఘనలకు పాల్పడిన వైసీపీ ఎమ్మెల్యేల వ్యవహారంపై సీబీఐ విచారణకు ఎందుకు అదేశించకూడదంటై హైకోర్టు ధర్మాసనం తీవ్రమైన కామెంట్లు చేసింది. స్వయానా ఎమ్మెల్యేలే లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ ఇటీవల ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. మహమ్మారి వైరస్ వ్యాప్తి చెందేలా వైసీపీ నేతలు వ్యవహరించారని... వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని పిటిషన్ దారులు కోరారు.

దీనిపై నేడు విచారించిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపైనా, నిబంధనలను ఉల్లంఘించిన వైసీపీ ప్రజాప్రతినిధులపైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాప్రతినిధులై ఉండి నిబంధనలను పాటించలేదని వ్యాఖ్యానించింది. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తోపాటు ఎమ్మెల్యేలే మల్లాది విష్ణు, శ్రీదేవి , ఎమ్మెల్యే రోజా తదితరులు మొత్తం ఎనిమిది మంది వైసీపీ ఎమ్మెల్యేలు లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ హైకోర్టులో వేర్వేరు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి.

అయితే, ప్రభుత్వ పథకాల లబ్దిదారులతో ఇంటరక్షన్‌లో భాగంగానే ఎమ్మెల్యేలు అలా వ్యవహరించారని ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాది సుమన్ ధర్మాసనానికి వివరించే ప్రయత్నం చేశారు. ప్రజా ప్రతినిధులైన వారే నిబంధనలు పాటించనవుడు, ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకొనపుడు సీబీఐ విచారణ ఎందుకు చేయకూడదు అని ధర్మాసనం తీవ్రమైన వ్యాఖ్యలను చేసింది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం తరపున వివరాలు అందించేందుకు కొంత సమయం ఇవ్వాలని ఏజీ కోరారు. దీంతో, విచారణను వచ్చే వారానికి హైకోర్టు వాయిదా వేసింది.