Begin typing your search above and press return to search.

మావోయిస్టులకూ పెద్ద నోట్ల సెగ

By:  Tupaki Desk   |   12 Nov 2016 6:12 AM GMT
మావోయిస్టులకూ పెద్ద నోట్ల సెగ
X
పెద్ద నోట్ల రద్దు వ్యవహారం సామాన్య ప్రజలకే కాదు సకల వర్గాలకూ షాకిచ్చింది. ప్రభుత్వ అణిచివేతలు - పోలీసు ఎన్ కౌంటర్లు - కూంబింగులు - బాంబింగులకు కూడా భయపడని మావోయిస్టులు ఇప్పుడు పెద్ద నోట్ల రద్దుతో వణుకుతున్నట్లు తెలుస్తోంది. తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకునేందుకు వారు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే... ఈ క్రమంలో పోలీసులకు ఎక్కడ దొరికిపోతామో అన్న ఆందోళన వారిని వెంటాడుతోంది.

మావోయిస్టులకు విరాళాలు - చందాల రూపంలో నిధులు అందుతాయి. వాటిని డంపుల్లో - సానుభూతిపరుల ఖాతాల్లో ఉంచుతారు. తమ కార్యకలాపాల కోసం - అవసరమైతే ఆయుధాల కొనుగోళ్లకు వాడుతారు. అలాంటి డంపుల్లో సాధారణంగా పెద్ద నోట్లే ఉంటాయి. వాటిని ఇప్పుడు మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో మావోయిస్టులు కూడా పెద్దనోట్లు మార్చుకునే పనిలో మావోయిస్టులు కూడా ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారం. ఈ సమాచారం మేరకు మావోయిస్టు నేతకు చెందిన రూ.25 లక్షలను జార్ఖండ్ పోలీసులు నిన్న స్వాధీనం చేసుకున్నారు.

డంపుల్లో ఆయుధాలతో పాటు డబ్బులను మావోలు దాస్తుంటారని, రూ.500 - రూ.1000 నోట్ల మార్పిడికి గిరిజనులను ఉపయోగించుకుంటున్నారని నిఘా వర్గాల ద్వారా తెలుస్తోంది. బీహార్ - జార్ఖండ్ రాష్ట్రాల నుంచి మావోలకు సంబంధించిన పెద్దనోట్ల మార్పిడి జరగవచ్చనే సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో గిరిజనులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలపై సంబంధిత అధికారులు ఒక కన్నేసినట్లు తెలుస్తోంది.

పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్లయ్యే గిరిజనుల ఖాతాలపై కన్ను పడడంతో వారి ద్వారా తమ ఆచూకీ తెలుస్తుందనే భయం మావోయిస్టుల్లో ఉంది. మరోవైపు చందాల కోసం కాంట్రాక్టర్లు - మిల్లర్లు - పారిశ్రామికవేత్తలు - ఇతరవర్గాలపై మావోయిస్టులు ఆధారపడతారు. ఇప్పటికే ఇలా చందాలిచ్చేవారిలో చాలామంది మావోయిస్టులకు వ్యతిరేకంగా పోలీసులకు ఉప్పందిస్తుంటారు. అంతేకాదు... పోలీసుల నిఘా ఎక్కువగా ఉండడంతో చందాల వసూలు కూడా పార్టీకి కష్టమవుతుంది. ఇప్పుడు తమ వద్ద ఉన్న డబ్బు నిల్వలు వృథా అయితే... మళ్లీ కొత్తగా చందాల వసూలూ కష్టమే అని మావోయిస్టులు ఆందోళన చెందుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/