Begin typing your search above and press return to search.

పోలీసుల‌కు త‌ల‌నొప్పిగా ప‌రిపూర్ణానంద ఎపిసోడ్‌!

By:  Tupaki Desk   |   9 July 2018 9:45 AM GMT
పోలీసుల‌కు త‌ల‌నొప్పిగా ప‌రిపూర్ణానంద ఎపిసోడ్‌!
X
కొన్ని త‌ప్పుల‌కు ఖ‌రీదైన మూల్యం చెల్లించాల్సి వ‌స్తుంటుంది. తాజాగా హైద‌రాబాద్ పోలీసులు అలాంటి త‌ప్పునే చేసిన‌ట్లుగా ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. శ్రీ‌రాముడిపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన క‌త్తి మ‌హేశ్ పై చ‌ర్య‌ల విష‌యంలో పోలీసులు ఒక తీరులో.. క‌త్తి వ్యాఖ్య‌ల‌పై నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ ధ‌ర్మాగ్ర‌హ యాత్రను త‌ల‌పెట్టిన స్వామి ప‌రిపూర్ణానంద విష‌యంలో మ‌రోలా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు.

క‌త్తి వ్యాఖ్య‌ల‌పై నిర‌స‌న‌గా యాదాద్రి వ‌ర‌కూ ప‌రిపూర్ణానంద స్వామి ధ‌ర్మాగ్ర‌హం యాత్ర‌ను చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించారు. ఇందుకు అవ‌స‌ర‌మైన పోలీస్ ప‌ర్మిష‌న్ తీసుకున్నారు. అయితే.. స్వామి చేప‌ట్టే యాత్ర‌ కార‌ణంగా తెలంగాణ ప్ర‌భుత్వానికి కొత్త స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంద‌న్న విష‌యాన్ని నిఘా వ‌ర్గాల ద్వారా స‌మాచారం అంద‌టంతో పోలీసులు ఒక్క‌సారిగా అలెర్ట్ అయ్యారు.

ఇచ్చిన ప‌ర్మిష‌న్ ను ర‌ద్దు చేయ‌ట‌మేకాదు.. ప‌రిపూర్ణానంద స్వామిని హౌస్ అరెస్ట్ చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. దీనిపై స్వామిని ఆరాధించే వారు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ లోని ఆయ‌న నివాసం ద‌గ్గ‌ర ఉద్రిక్త‌త నెల‌కొంది. హిందుత్వ‌వాదులు పెద్ద సంఖ్య‌లో ఆయ‌న ఇంటి వ‌ద్ద‌కు చేరుకోవ‌టంతో పోలీసు భ‌ద్ర‌త‌ను మ‌రింత‌గా పెంచారు.

ఇదిలా ఉంటే.. స్వామిని అరెస్ట్ చేస్తారా? అంటూ ఒక వ్య‌క్తి పెట్రోల్ పోసుకొని ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసుకునే ప్ర‌య‌త్నం చేయ‌టంతో వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా వేడెక్కింది. పెట్రోల్ డ‌బ్బాను తీసుకొచ్చిన ఆయ‌న స్వామిజీకి మ‌ద్ద‌తుగా ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని చెప్ప‌టంతో పోలీసులు ఉలిక్కిప‌డ్డారు. అత‌డ్ని అడ్డుకొని అదుపులోకి తీసుకొని బ‌య‌ట‌కు తీసుకెళ్లారు.

స్వామీజీని హౌస్ అరెస్ట్ చేయ‌టంపై బీజేపీ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్వామిని క‌లుకునేందుకు వ‌చ్చారు. శ్రీ‌రాముడిపై క‌త్తి మ‌హేశ్ వ్యాఖ్య‌ల‌కు నిర‌స‌న‌గా ధ‌ర్మాగ్ర‌హ యాత్ర త‌ల‌పెట్టిన స్వామిని గృహ నిర్బంధానికి గురి చేస్తారా? అంటూ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ మండిప‌డ్డారు. ప్ర‌జాస్వామ్యంలో పాద‌యాత్ర‌లు చేయ‌టం.. నిర‌స‌న‌లు ప్ర‌ద‌ర్శించ‌టం రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్కు అని.. వాటిని ప్ర‌భుత్వాలు కాల‌రాయ‌కూడ‌ద‌న్న లక్ష్మ‌ణ్ పోలీసుల తీరును త‌ప్పు ప‌ట్టారు. మొత్తంగా ప‌రిపూర్ణానంద స్వామి త‌ల‌పెట్టిన ధ‌ర్మాగ్ర‌హ యాత్ర విష‌యంలో పోలీసులు త‌డ‌బాటుకు గురైన‌ట్లుగా చెబుతున్నారు. యాత్ర స్టార్ట్ కావ‌టానికి గంట‌.. రెండు గంట‌ల ముందు ఇలా అడ్డుకునే క‌న్నా.. క‌త్తిపై చ‌ర్య‌ల విష‌యంలో ముందే నిర్ణ‌యం తీసుకుంటే విష‌యం ఇంత‌వ‌ర‌కూ వ‌చ్చేది కాద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మొత్తంగా చూస్తే.. ప‌రిపూర్ణానంద స్వామి ఇంటి వ‌ద్ద స్వ‌ల్ప ఉద్రిక‌త్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఈ హ‌డావుడి సాయంత్రం వ‌ర‌కూ సాగుతుంద‌న్న మాట వినిపిస్తోంది.