Begin typing your search above and press return to search.

ఏపీలో ఎన్నికల ఉద్రిక్తతలు మామూలుగా లేవుగా?

By:  Tupaki Desk   |   11 April 2019 10:46 AM GMT
ఏపీలో ఎన్నికల ఉద్రిక్తతలు మామూలుగా లేవుగా?
X
ఏపీలో ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి? అన్న డౌట్ వచ్చిందా? మీకు తెలిసిన వెబ్ సైట్లను ఒక్కసారి చెక్ చేయండి. జస్ట్ పది నిమిషాల్లో మీకు.. ఏపీలో ఏం జరుగుతుందో అర్థం కాదు. అధికారపక్షానికి అనుకులంగా ఉండే మీడియాలో జగన్ పార్టీ ఆరాచకం చేస్తున్నట్లుగా.. విపక్ష అనుకూల మీడియాలో అధికార తెలుగుదేశం పార్టీ నేతలు.. కార్యకర్తలు హల్ చల్ చేస్తున్నట్లుగా వార్తలు దట్టించి ఉన్న నేపథ్యంలో.. అసలు ఏపీలో ఏం జరుగుతుంది? ఎవరేం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి.

ఎన్నికల ప్రచారంలోనే భారీ హీట్ జనరేట్ అయి.. పోటాపోటీగా సాగుతున్న ఎన్నికల సభల్ని చూస్తేనే ఈసారి పోలింగ్ అంత సింఫుల్ గా పూర్తి కాదని.. అంతో ఇంతో హింస చోటు చేసుకోవటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమైంది. దీనికి తగ్గట్లే.. ఏపీ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో అంతో ఇంతో ఉద్రిక్తతంగా సాగుతాయన్న మాట బలంగా వినిపించింది. ఇందుకు తగ్గట్టే ఈ రోజు ఉదయం నుంచి ఏపీ వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో చిన్న చిన్న గొడవలు మొదలు.. నరుక్కోవటాలు.. చంపుకోవటాల వరకూ వెళ్లటం గమనార్హం.

వాటికి సంబంధించిన అంశాల్ని చూస్తే..

% అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం మీరాపురంలో టీడీపీ.. జగన్ పార్టీ నేతల మధ్య గొడవ జరిగింది. చూస్తున్నంతలోనే అదో తీవ్రమైన గొడవగా మారి.. మాటల స్థానే వేటకత్తుల వరకూ వెళ్లింది. ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఈ గొడవ మరింతగా పెరిగి ఒకరిపై ఒకరు భౌతికదాడులకుపాల్పడ్డారు. వేట కొడవళ్లతో జరిగిన దాడిలో టీడీపీ కార్యకర్త చింతా భాస్కర్ రెడ్డి మరణించారు. మరోవైపు ఆయన పై దాడికి పాల్పడ్డ జగన్ పార్టీ కార్యకర్త పుల్లారెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అక్కడ పోలింగ్ నిలిపివేశారు. ఈ ఉదంతంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

% గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం ఇనిమెట్లలో సభాపతి కోడెల శివప్రసాద్ పై జగన్ పార్టీ వర్గీయులు ల దాడి చేసి చొక్కా చించివేశారు. పోలింగ్ బూత్‌ లోకి కోడెల వెళ్లడంపై వైకాపా కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తంచేశారు. అనంతరం రెండు పార్టీల ఏజెంట్లు గొడవకు దిగారు. ఈ క్రమంలో సభాపతి చొక్కాను వైకాపా కార్యకర్తలు చించివేశారు. ఈ క్రమంలో కోడెల సొమ్మసిల్లారు. ఆయన కారు అద్దాలనూ పగలగొట్టారు.

% కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని అహోబిలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరి భూమా మౌనిక కారు అద్దాలను జగన్ పార్టీ వర్గీయులు థ్వంసం చేశారు. దీంతో.. పోలీసుల తీరుపై మౌనిక ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పార్టీ కార్యకర్తలు కర్రలు.. రాళ్లతో తిరుగుతున్నా పోలీసులు పట్టనట్లు వ్యవహరించటం ఏమిటి? అని ప్రశ్నించారు.

% ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని అహోబిలంలో టీడీపీ.. జగన్ పార్టీ వర్గాల మధ్య దాడులు చోటు చేసుకున్నాయి. రెండు వర్గాల వారు కర్రలతో కొట్టుకొని.. రాళ్లతో దాడి చేసుకున్నారు.

% ప్రకాశం జిల్లా చీరాలలో జగన్ పార్టీ నేత.. మున్సిపల్ చైర్మన్ మోదడుగు రమేష్ బాబు 103 పోలింగ్ బూత్‌లో హల్‌చల్‌ చేశారు. ఓటు వేసేందుకు లోపలికి వచ్చిన ఆయనను గుర్తింపు కార్డు ఏదని ఏజెంట్ అడగడంతో.. బూతు పురాణం అందుకున్నారు. వీరంగం సృష్టించారు. పోలీసులు సర్ది చెప్పి ఆయన్ను పంపించేశారు.

% చిత్తూరు జిల్లా చంద్రగిరిలో వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రామచంద్రాపురం మండలం రాయుల్లవారిపల్లెలో తమకు అనుకూలంగా ఓట్లు వేయడంలేదని గ్రామస్థులపై దుర్భాషలాడారు. దీంతో గ్రామస్థులు చెవిరెడ్డిపై తిరగబడ్డట్లు సమాచారం.

% కడప జిల్లా జమ్మలమడుగు పొన్నతోటలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలింగ్‌ కేంద్రం వద్ద టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. సమాచారం అందుకున్న వైఎస్సార్‌ సీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి, సుధీర్‌ రెడ్డిలు అక్కడి చేరుకున్నారు.

% పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పోలింగ్‌ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాంనగర్‌ 9వ రోడ్డులోని పోలింగ్‌బూత్‌లో వైఎస్సార్‌సీపీ కన్వీనర్‌ మట్టా రాజుపై టీడీపీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి దాడికి పాల్పడ్డారు. రాజు తలకు తీవ్ర గాయాలు కావడంతో ఏలూరు ఆసుపత్రికి తరలించారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.