Begin typing your search above and press return to search.

శ్రీలంక పేలుళ్ల తర్వాత ఇండియా అనునిత్యం అలర్ట్ గానే!

By:  Tupaki Desk   |   1 Jun 2019 7:00 AM IST
శ్రీలంక పేలుళ్ల తర్వాత ఇండియా అనునిత్యం అలర్ట్ గానే!
X
శ్రీలంక రాజధాని కొలంబోలో గత నెలలో జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో హైదరాబాద్- ముంబయి- బెంగళూరు నగరాల్లో భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి. ఈమేరకు పెద్ద పెద్ద అపార్టుమెంటుల వద్ద భద్రత భారీ స్థాయిలో పెంచారు. అంతేకాకుండా సెక్యూరిటీ సిబ్బందిని కూడా నియమించారు. కొరియర్, ఫుడ్‌ డెలివరీ చేస్తున్న వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచారు. బస్‌స్టేషన్, రైల్వే స్టేషన్‌లలో తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రతి ఒక్కరినీ ఆపి.. బ్యాగులు తదతర సరుకులు ఉన్న సంచులను తనిఖీ చేస్తున్నారు. దీనికి తోడు 500 మంది పైగా జనాలు ఉన్న ప్రతి కూడలిలో భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

ఈ క్రమంలో వేల మంది నివసించే అపార్టుమెంటు వద్ద ప్రత్యేక భద్రత వ్యవస్థ ఏర్పాటు చేశారు. సెక్యూరిటీ గార్డులతో పాటు సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. ప్రతి అపార్టుమెంటు వద్ద వచ్చి వెళ్లే వారి వివరాలు తప్పనిసరి రికార్డులో నమోదు చేస్తున్నారు. అపార్టుమెంటులోకి వెళ్లాలంటే పేరు, ఫోన్‌ నంబరు, సంప్రదించాల్సిన వ్యక్తి తదితర వివరాలు సెక్యూరిటీ సిబ్బందికి లిఖితపూర్వకంగా ఇవ్వాల్సి ఉంటోంది.

ఆయా నగరాల్లోని పలు అపార్టుమెంటుల వద్ద సెక్యూరిటీ సిబ్బందిని రెండింతలు చేశారు. మూడు విడతల్లో నియమించారు. ప్రతి అపార్టుమెంటు వద్ద వచ్చి వెళ్లే వారి వివరాలతో పాటు సీసీ కెమెరాలతో నిఘా ఉంచారు. అంతేకాకుండా పాత సిబ్బందిని మార్చి కొత్తవారిని తీసుకొచ్చారు. అనుమానం ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని ఉద్యోగం నుంచి తొలగించిన దాఖలాలు కూడా ఉన్నాయి.

అంతేకాకుండా అలసత్వం వహిస్తున్న.. అప్రమత్తంగా లేని వారిని సెక్యూరిటీ విధుల నుంచి తొలగించారు. అపార్టుమెంటుల్లో చాలావరకు బిల్డర్లు, కన్‌స్ట్రక్టర్లు, సినీనిర్మాతలు, రాజకీయ నాయకులు నివసిస్తుంటారు. ఈక్రమంలో సాధారణ సెక్యూరిటీతో పాటు ప్రత్యేకంగా ప్రైవేటు సిబ్బందిని కూడా నియమించుకున్నట్లు తెలిసింది. కార్లు తనిఖీ చేసే పరికరాలు, లగేజీ, వ్యక్తిగత తనిఖీ చేసే పరికరాలు అందుబాటులోకి ఉంచారు. డోర్‌ఫ్రేమ్‌ డిటెక్టర్లు కూడా సిద్ధం చేసినట్లు సమాచారం.

భద్రతా నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బందికి ప్రత్యేకంగా మొబైల్‌ యాప్‌లు రూపొందించారు. వాటి ఆధారంగా అపార్టుమెంట్ల వద్ద సంచరిస్తున్న అపరిచిత వ్యక్తుల వివరాలను యాప్‌లో పొందుపరుస్తారు. ఈ సందర్భంగా మై బిల్డింగ్, మై గేట్, ఆప్నా కాంప్లెక్స్, అపార్ట్‌మెంట్‌ అడ్డా తదితర యాప్‌లు అందుబాటులోకి తెచ్చారు.

ఈ యాప్‌ ల ద్వారా అపార్టుమెంటులోకి కొత్తగా వచ్చే వారి వివరాలను సంప్రదించాల్సిన వారికి మొబైల్‌ యాప్‌ ద్వారా పంపించి వారి ఆమోదం తర్వాత లోపలికి వదిలే వీలు కల్పించారు. అదేవిధంగా కొరియర్లు, ఆన్‌లైన్‌ ఆర్డర్‌ చేసిన ఫుడ్, వస్తువులు తదితర సామగ్రి తెచ్చే వారిపై ప్రత్యేక నిఘా ఉంచారు. సంబంధిత వినియోగదారుడి ఆమోదంతోనే అపార్టుమెంటు లోపలికి అనుమతిస్తున్నారు. లేనిపక్షంలో అనుమానిత వ్యక్తులుగా పరిగణించి వెనక్కి పంపుతున్న దాఖలాలు కూడా ఉన్నాయి.