Begin typing your search above and press return to search.

6 లక్షల పన్ను కట్టలేవా రజినీ..? హైకోర్టు ఆగ్రహం

By:  Tupaki Desk   |   14 Oct 2020 3:20 PM IST
6 లక్షల పన్ను కట్టలేవా రజినీ..? హైకోర్టు ఆగ్రహం
X
వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు అప్పుడే పార్టీలన్నీ రెడీ అయిపోతున్నాయి. ప్రధానంగా అధికార ప్రతిపక్షాలైన అన్నాడీఎంకే, డీఎంకేలు రెడీ అయిపోతున్నాయి. మధ్యలో కమల్ హాసన్ పార్టీ, బీజేపీ , కాంగ్రెస్ లు అదృష్టం పరీక్షించుకుంటున్నాయి.

ఇక అందరి చూపు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ వైపే ఉంది. ఆయన ఈసారి ఎన్నికల్లో పోటీచేస్తాడా? లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఈ క్రమంలోనే అధికార అన్నాడీఎంకే వ్యూహాత్మకంగా రజనీకాంత్ ను టార్గెట్ చేసినట్టు ప్రచారం సాగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకున్న అన్నాడీఎంకే ఒకవేళ రజినీకాంత్ రంగంలోకి దిగితే తమకు ఓటమి ఖాయమని భయపడుతోంది. అందుకే ఆయనపై తమిళనాడు ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రయోగిస్తోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

తాజాగా రజినీకాంత్ పై అధికార అన్నాడీఎంకే కక్షసాధింపులకు దిగిందన్న టాక్ ఆయన అభిమానుల్లో నెలకొంది. రజినీకాంత్ కు చెందిన ‘రాఘవేంద్ర కళ్యాణ మండపం’ఫై అన్నాడీఎంకేపార్టీ ఆస్తి పన్ను వేసిన వ్యవహారం రాజకీయంగా హీట్ పెంచింది. 6.50 లక్షల రూపాయల ఆస్తి పన్నును చెల్లించాలంటూ మున్సిపల్ అధికారులు రజినీకాంత్ కు నోటీసులు పంపించారు. దీనిని వ్యతిరేకిస్తూ రజినీకాంత్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు.

కరోనా కారణంగా లాక్ డౌన్ విధించిన మార్చి 24 నుంచి రాఘవేంద్ర కళ్యాణమండపం మూసి ఉంది. అప్పటి నుంచి ఎలాంటి ఆదాయం లేనందున గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ విధించిన ఆస్తి పన్ను చెల్లించలేమని రజినీ తరుఫు లాయర్ మద్రాస్ హైకోర్టుకు తెలిపారు.

దీంతో మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ పన్నుకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించినందుకు జరిమానా విధించాల్సి ఉంటుందని రజినీని కోర్టు హెచ్చరించింది. అయితే ఈ కేసును విత్ డ్రా చేసుకోవడానికి తమకు కొంత సమయం కావాలని రజినీ తరుఫు లాయర్ కోర్టును కోరారు.