Begin typing your search above and press return to search.

గందరగోళంగా ఓట్ల లెక్కింపు: ఎస్ఈసీ ఉత్తర్వులు కొట్టేసిన హైకోర్టు

By:  Tupaki Desk   |   4 Dec 2020 11:26 AM IST
గందరగోళంగా ఓట్ల లెక్కింపు: ఎస్ఈసీ ఉత్తర్వులు కొట్టేసిన హైకోర్టు
X
జీహెచ్ఎంసీ ఎన్నిక కౌంటింగ్ గందరగోళంలో పడిపోయింది. నిన్న రాత్రి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్వస్తిక్ గుర్తు ఓట్లపై లేకున్నా.. పెన్నుతో టిక్ చేసినా కూడా ఓటుగానే పరిగణించాలని ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై బీజేపీ హైకోర్టుకు ఎక్కగా.. తాజాగా స్వస్తిక్ గుర్తు ఉంటే ఓటు అని తీర్పునిచ్చింది. ఇప్పటికే ఎస్ఈసీ ఆదేశాల మేరకు కౌంటింగ్ పూర్తయ్యింది. బీజేపీకే పోస్టల్ బ్యాలెట్ లో మెజార్టీ వచ్చింది. స్వస్తిక్ గుర్తు లేని వాటిని కూడా లెక్కించారు. ఇప్పుడు హైకోర్టు ఆదేశాలతో మళ్లీ లెక్కిస్తారా? అదే కొనసాగిస్తారా అన్నది గందరగోళంగా మారింది. హైకోర్టు ఉత్తర్వులు వచ్చే వరకు లేట్ కావడం ఖాయం కావడంతో దీనిపై ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఆసక్తిగా మారింది.

రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు హైక్టోర్టు ఈ ఉదయం షాకిచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పెన్నుతో టిక్ చేసిన ఓట్లను లెక్కించాలని ఎన్నికల అధికారులకు ఎన్నికల కమిషన్ సూచించింది. అయితే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు పెన్నుతో ఉన్న ఓట్లను లెక్కించొద్దని.. కేవలం స్వస్తిక్ గుర్తున్న ఓట్లనే లెక్కించాలని తాజాగా ఆదేశాలిచ్చింది. ఎన్నికల సంఘం ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తుందని హైకోర్టులో బీజేపీ నేతలు తమ వాదనలు విన్పించగా హైకోర్టు ఈమేరకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వెలువడుతున్న ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. ఎన్నికల అధికారులు తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కింపును పూర్తి చేసినట్లు సమాచారం.

ఈ పోస్టల్ బ్యాలెట్ ఓటింగులో బీజేపీ దూసుకెళుతోంది. తాజా సమాచారం మేరకు 150 డివిజన్లకు గాను బీజేపీ అభ్యర్థులు 80కి పైగా స్థానాల్లో లీడ్ లో ఉన్నారు... టీఆర్ఎస్ అభ్యర్థులు 35 స్థానాల్లో.. ఎంఐఎం అభ్యర్థులు 11 స్థానాల్లో.. కాంగ్రెస్ మూడు స్థానంలో అధిక్యంలో ఉన్నాయి. తాజాగా పోస్టల్ ఓట్లు పూర్తవడంతో ఇక బ్యాలెట్ ఓట్లను లెక్కించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

ఇప్పటికే కొన్ని డివిజన్లలో బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. రౌండ్ల వారీగా ఫలితాలను అధికారులు వెల్లడించారు. రౌండ్ కు 14వేల ఓట్లను లెక్కించనున్నారు. దీంతో తొలి ఫలితం మెహదీపట్నం నుంచే వెలువడనుంది. ఈ డివిజన్లలో కేవలం 11వేల ఓట్లు మాత్రమే పోలయ్యాయి. దీంతో తొలి ఫలితం ఇక్కడి నుంచే రానుంది. చివరగా మైలార్ దేవ్ పల్లి ఫలితం వచ్చే అవకాశం ఉంది. తాజాగా హైకోర్టు ఎన్నికల కమిషన్ కు స్వస్తిక్ గుర్తును మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించడంతో ఓట్ల లెక్కింపు ఆలస్యమయ్యేలా కన్పిస్తుంది. రిజల్ట్స్ ను హోల్డ్ లో పెట్టే చాన్స్ ఉందని అంటున్నారు.