Begin typing your search above and press return to search.

వల్లభనేని వంశీకి హైకోర్టు షాక్‌!

By:  Tupaki Desk   |   19 Oct 2022 4:09 AM GMT
వల్లభనేని వంశీకి హైకోర్టు షాక్‌!
X
గత ఎన్నికల్లో కృష్ణా జిల్లా గన్నవరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు.. వల్లభనేని వంశీమోహన్‌. ఆ తర్వాత కొద్ది కాలానికే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్‌లపై తీవ్ర విమర్శలు చేసి వైసీపీ పంచన చేరారు. వచ్చే ఎన్నికల్లోనూ గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని వంశీ చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు వల్లభనేని వంశీకి షాక్‌ ఇచ్చింది. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేసి వంశీ చేతిలో ఓడిపోయారు. అయితే ఈ ఎన్నికల్లో వంశీ అక్రమ పద్ధతుల్లో గెలుపొందారని.. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికను రద్దు చేయాలని యార్లగడ్డ వెంకట్రావు హైకోర్టును ఆశ్రయించారు.

గన్నవరం నియోజకవర్గం బాపులపాడు తహసీల్దార్‌ స్టాంపును ఫోర్జరీ చేశారని యార్లగడ్డ వెంకట్రావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఫోర్జరీ చేయడంతోపాటు 12 వేల నకిలీ ఇళ్ల పట్టాలను తన అనుచరులకు వంశీ పంచిపెట్టారని తెలిపారు. అలాగే ప్రసాదంపాడు పోలింగ్‌ బూత్‌లో రిగ్గింగ్‌ చేసినట్లు వల్లభనేని వంశీపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారని యార్లగడ్డ తన పిటిషన్‌లో వివరించారు.

తాను ఈ పిటిషన్‌ దాఖలు చేసి రెండేళ్లకు పైగానే అవుతున్నా.. ఇప్పటివరకు ప్రతివాదులకు నోటీసులు ఇవ్వలేదని యార్లగడ్డ వెంకట్రావు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పిటిషన్‌ వల్ల ఫలితం లేకుండా పోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాతో విచారణలో ఆలస్యమైనప్పటికి.. ఇప్పటికైనా ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని యార్లగడ్డ వెంకట్రావు కోర్టును అభ్యర్థించారు.

యార్లగడ్డ వెంకట్రావు తరఫు న్యాయవాది వాదనలు విన్న ధర్మాసనం.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా నాటి గన్నవరం రిటర్నింగ్‌ అధికారి, కేంద్ర ఎన్నికల సంఘాలకు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 28వ తేదీకి వాయిదా వేసింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.