Begin typing your search above and press return to search.

ఏపీ ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ.. ఆ జీవోల్ని రద్దు చేస్తూ షాకిచ్చిన హైకోర్టు

By:  Tupaki Desk   |   4 Sep 2021 3:30 AM GMT
ఏపీ ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ.. ఆ జీవోల్ని రద్దు చేస్తూ షాకిచ్చిన హైకోర్టు
X
ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు న్యాయస్థానాల్లో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా అలాంటి చేదు అనుభవం ఒకటి ఎదురైంది. కాలేజీల్లో చదివే అర్హులైన విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన పథకం కింద ఫీజు రీయింబర్స్ మెంట్ మొత్తాల్ని వారి తల్లుల ఖాతాల్లోకి జమ చేయటాన్ని ఏపీ హైకోర్టు తప్పు పట్టింది. ఇకపై.. విద్యార్థుల తరఫున సొమ్మును కాలేజీల ఖాతాల్లో వేయాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించిన జీవోల్ని రద్దు చేస్తూ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

తల్లుల ఖాతాలోకి పిల్లల ఫీజు మొత్తాల్ని వేసేందుకు ఉద్దేశించిన జీవో 28తో పాటు మరో జీవో 64ను కూడా రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు తాజాగా ఆదేశాల్ని జారీ చేసింది. తల్లుల ఖాతాల్లో జమ చేసిన మొత్తాన్ని కాలేజీలకు చెల్లించేలా చూసే బాధ్యత ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. అంతేకాదు.. కాలేజీలు ఆయా విద్యార్థుల నుంచి వసూలు చేసుకోవచ్చని పేర్కొంది. 2019 నవంబరులో జగన్ ప్రభుత్వం జీవో 115ను తీసుకొచ్చింది.

ఈ జీవోకు ముందు వరకు విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ ను కాలేజీ ఖాతాలో వేసే వారు. అందుకు భిన్నంగా పిల్లల తల్లుల ఖాతాల్లో వేయటాన్ని తప్పు పట్టింది. ఫీజుల చెల్లింపు కోసం ఇచ్చే డబ్బుల్ని విద్యార్థుల తల్లిదండ్రులు వేరే అవసరాలకు ఆ మొత్తాల్ని ఖర్చు చేసుకునే వీలుందని పేర్కొంది. అంతేకాదు.. విద్యార్థుల తల్లుల ఖాతాలకు డబ్బులు జమ చేసేందుకు అవకాశం ఇస్తున్న జీవోను రద్దు చేశారు.

ప్రభుత్వం తల్లుల ఖాతాలకు జమ చేసిన మొత్తంలో 40 శాతం మంది ఇంకా కాలేజీలకు ఫీజులు చెల్లించలేదన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. ఫీజులు చెల్లించకుండా కాలేజీలు చదువులు చెప్పలేవన్న కీలక వ్యాఖ్యను హైకోర్టు చేసింది. కాలేజీల్లోని మౌలిక వసతులు.. తరగతులు సక్రమంగా నిర్వహిస్తున్నారా? లేదా? అన్న విషయాల్ని పరిశీలించే అవకాశం విద్యార్థులకు తల్లిదండ్రులకు ఇచ్చారని.. మరి.. తల్లులు ఫీజులు చెల్లించకపోతే ఎలా? అని ప్రశ్నించింది. ఫీజులు చెల్లించకుండా కాలేజీల్లో కొనసాగే అవకాశం లేదన్న విషయాన్ని మాత్రం జీవోలో పేర్కొనకపోవటాన్ని ప్రశ్నించింది.

తల్లుల ఖాతాలకు బదులుగా కాలేజీ ఖాతాల్లో ఫీజుల్ని జమ చేస్తే.. విద్యార్థుల చదువులు మధ్యలో ఆగేందుకు అవకాశాలు చాలా తక్కువగా పేర్కొంది. దీని ద్వారా పథకం అమలు చేస్తున్న ప్రభుత్వ ఆశయం నెరవేరుతుందని పేర్కొంది. మొత్తంగా ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో జగన్ సర్కారు తీసుకొచ్చిన మార్పును హైకోర్టు కొట్టేస్తూ.. యథాతధ స్థితికి తీసుకొచ్చిందని చెప్పాలి.