Begin typing your search above and press return to search.

ఏబీకి షాకిచ్చిన హైకోర్టు..అరెస్టు తప్పదా ?

By:  Tupaki Desk   |   1 Oct 2020 9:18 AM IST
ఏబీకి షాకిచ్చిన హైకోర్టు..అరెస్టు తప్పదా ?
X
ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టు పెద్ద షాకే ఇచ్చింది. ప్రభుత్వం తనను అరెస్టు చేయకుండా స్టే ఇవ్వాలంటు వేసిన కేసును హైకోర్టు కొట్టేసింది. టిడిపి హయాంలో ఏబీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసినపుడు చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన విషయం అందరికీ తెలిసిందే. ఇదే సమయంలో ఇజ్రాయెల్ నుండి అత్యంతాధునికమైన సెక్యూరిటీ+సాంకేతిక పరికరాలు కొనుగోలు చేశారు. మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత వైసిపి అధికారంలోకి రాగానే ప్రభుత్వం ఈ విషయమై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అంతర్గతంగా జరిగిన విచారణలో సుమారు రూ. 25 కోట్లతో కొనుగోలు చేసిన పరికరాలను ఎటువంటి టెండర్లు లేకుండానే నామినేటెడ్ పద్దతిలో కొనేశారన్న విషయం బయటపడింది.

అసలే వైసిపి ఏబిపై ఎప్పటి నుండో మండిపోతున్నారు. 2014-19 మధ్య చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో జరిగిన ఎంఎల్ఏలు, ఎంపిల ఫిరాయింపులో ఏబిదే ప్రముఖపాత్రగా ఆరోపణలున్న విషయం అందరికీ తెలిసిందే. దాంతో సెక్యురిటి పరికరాల కొనుగోలు విషయం బయటపడగానే ఏబీని ప్రభుత్వం ఏబిని సస్పెండ్ చేసింది. తన కొడుకు చేత డమ్మీ కంపెనీని పెట్టించి నామినేషన్ పద్దతిలో ఏబీనే కాంట్రాక్టు దక్కించుకున్నాడన్నది ఆరోపణ. దీనిపై ఏబి సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రైబ్యునల్ (క్యాట్) లో సవాలు చేశారు. అయితే ఈ విషయమై విచారణ జరిపిన క్యాట్ ప్రభుత్వం చర్యనే సమర్ధించింది. అయితే ఏబి ఇదే విషయాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేయగా సస్పెన్షన్ను కొట్టేసింది. దీనిపై ప్రభుత్వం వేసిన రివ్యూ పిటీషన్ విచారణలో ఉంది.

అయితే మరి ఏమి అనుమానం వచ్చిందో ఏమో తనపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా అడ్డుకోవాలంటూ ఏబి హైకోర్టులో ఓ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్ధానం ఏబి పిటీషన్ను కొట్టేసింది. అంటే ఏబీని అరెస్టు చేయాలని ప్రభుత్వం అనుకుంటే న్యాయపరమైన ఇబ్బందులు తొలగినట్లే అనుకోవాలి. చంద్రబాబు హయాంలో ఏబీ ఓ వెలుగు వెలిగారన్నది వాస్తవం. తాను ఓ ఐపిఎస్ అధికారిని మాత్రమే అని ప్రభుత్వంలో ఎవరున్నా తాను ఉన్నతాధికారిగా మాత్రమే పనిచేయాలన్న విషయాన్ని ఏబి మరచిపోయినట్లు అప్పట్లో వైసిపి ఎంఎల్ఏలు పదే పదే ఆరోపణలు చేశారు.

దానికితోడు అప్పట్లో టీడీపీ నేతలు చేసిన ప్రకటనలు కూడా ఏబీకి బాగా డ్యామేజయ్యాయి. విజయవాడ పార్టీ సమావేశంలో ఎంఎల్సీ బుద్దా వెంకన్న మాట్లాడుతూ తెలుగుయువత అధ్యక్షునిగా దేవినేని అవినాష్ నియామకానికి ఏబి వెంకటేశ్వరరావే సాయం చేసినట్లు చెప్పటం సంచలనమైంది. అలాగే మరో సందర్భంలో విజయవాడ తూర్పు ఎంఎల్ఏ గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ పార్టీ సమస్యలను ఏబి ద్వారానే చంద్రబాబు దృష్టికి తీసుకెళిన్నట్లు చెప్పారు. అందుకనే ఏబి ఐపిఎస్ అధికారిగా కాకుండా చంద్రబాబుకు సన్నిహితునిగా మారిపోయారంటూ ఆరోపణలు చేశారు. సరే ఎవరి ఆరోపణలు ఎలాగున్నా ప్రస్తుతం ఏబి అయితే సమస్యల్లో ఇరుక్కున్నది మాత్రం వాస్తవం. కోర్టు తాజా తీర్పు నేపధ్యంలో ఏబీ విషయంలో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిందే.