Begin typing your search above and press return to search.

ప్రభుత్వానికి , ఆర్టీసీకి హైకోర్టు సీరియస్ వార్నింగ్ ..?

By:  Tupaki Desk   |   7 Nov 2019 10:03 AM GMT
ప్రభుత్వానికి , ఆర్టీసీకి హైకోర్టు సీరియస్ వార్నింగ్ ..?
X
తెలంగాణ లో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకి ముగింపే దొరకడంలేదు. ఈ సమ్మె మొదలుపెట్టి నేటికీ సరిగ్గా 34 రోజులు కావొస్తుంది. అయినప్పటికీ అటు ప్రభుత్వం కానీ , ఇటు కార్మికులు కానీ వెనక్కి తగ్గడంలేదు. దీనితో సమ్మె కి ముగింపు దొరకడంలేదు. అలాగే ఈ సమ్మె పై హైకోర్టు తాజాగా నేడు మరోసారి విచారణ చేపట్టింది. ఆర్టీసీ యాజమాన్యం, కార్మికుల మధ్య సయోధ్యకు ప్రయత్నిస్తున్నామని హైకోర్టు తెలిపింది.

అయితే, ప్రభుత్వం, ఆర్టీసీ చిత్త శుద్ధితో ముందుకు రావట్లేదని చెప్పింది. జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, ఆర్థిక శాఖల అధికారులు ఒక్కొక్కరు ఒక్కోలా లెక్కలు చెబుతున్నారని, ఒక దానితో ఒకటి సంబంధం లేకుండా చెబుతున్నారని పేర్కొంది. తమతో వ్యవహరించే తీరు ఇదేనా? అని ప్రశ్నించింది. మీ సమాచారంతో సీఎం, కేబినెట్, ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారా అని నిలదీసింది.

ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సమర్పించిన రెండు నివేదికలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని న్యాయ స్థానం తప్పు బట్టింది. ఐఏఎస్‌ అధికారులే హైకోర్టుకు ఇలా నివేదికలు ఇవ్వడం ఆశ్చర్యకరంగా ఉందని అభిప్రాయపడింది. ఉద్దేశ పూర్వకంగా తప్పుడు నివేదికలు ఇస్తే.. కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని తెలియదా అంటూ ప్రశ్నించింది. ఇక ఆర్టీసీ సమ్మెపై తదుపరి విచారణను ఈ నెల 11కు హైకోర్టు వాయిదా వేసింది. అంత లోపు చర్చలు జరపాలని ఇరు పక్షాలను హైకోర్టు ఆదేశించింది.