Begin typing your search above and press return to search.

కేటీఆర్ నోట మాట రాలేని రీతిలో తలంటిన హైకోర్టు

By:  Tupaki Desk   |   26 Sept 2019 10:50 AM IST
కేటీఆర్ నోట మాట రాలేని రీతిలో తలంటిన హైకోర్టు
X
రెండోసారి బాధ్యతలు స్వీకరించిన గంటల వ్యవధిలోనే జీహెచ్ ఎంసీ అధికారులతో భేటీ కావటం.. డెంగీ మీద యుద్ధాన్నే ప్రకటించినంత బిల్డప్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. ప్రజాప్రతినిధులు.. అధికారులు తెల్లవారుజామున ఐదు గంటలకే వీధుల్లోకి వచ్చేయాలని.. డెంగీ దోమ అంతు చూసేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టే కార్యాచరణను షురూ చేశారు.

అయితే.. మాటల్లో చెప్పినంత ఎఫెక్టివ్ గా పనులు చేయటం మాత్రం జరగలేదు. ఇదే సమయంలో డెంగీ వ్యాప్తి నిర్వహణలో ప్రజల బాధ్యతే ఎక్కువంటూ కేటీఆర్ నోట మాట మారింది. ఇలాంటివేళ.. హైకోర్టు డివిజన్ బెంచ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. డెంగీ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలపై హైకోర్టు పెదవి విరవటమే కాదు.. జీహెచ్ఎంసీ.. వైద్య ఆరోగ్యశాఖలు దాఖలు చేసిన కౌంటర్లలో పూర్తి వివరాలు లేవని తలంటింది.

వ్యాధి నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు అధికారులు ఇస్తున్న వివరణలో ఆచరణ ఏమీ కనిపించటం లేదని చెప్పటమే కాదు.. అందుకు తగిన ఆధారాల్ని ఎత్తి చూపింది. అధికారులు ఇచ్చిన లెక్కల ప్రకారం సెప్టెంబరు మొదటి వారంలో 138 డెంగీ కేసులు నమోదైతే.. 23 నాటికి వాటి సంఖ్య 309కి చేరిందని.. 22 రోజుల్లో 200 శాతం రోగులు పెరిగిన వైనాన్ని ప్రశ్నించింది.

యుద్ధ ప్రాతిపదికన చర్యలంటే రోగుల సంఖ్య తగ్గాలే కానీ ఎందుకు పెరిగాయి? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేని పరిస్థితి. క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇస్తే.. ఎన్ని ప్రభుత్వ.. ప్రైవేటు ఆసుపత్రులను సందర్శించి రోగుల్ని గుర్తించారో చెప్పాలని పేర్కొంది. నెల రోజుల్లో డెంగీని నగరం నుంచి తరిమి కొట్టాలన్న ఆదేశాల్ని జారీ చేసింది. ఒకవేళ ఈ విషయాన్ని చేయని పక్షంలో ఈ వ్యవహారాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించటం గమనార్హం. సామాన్యుడు అడగలేడు.. ప్రశ్నించే అవకాశం ఉన్న విలేకరి ప్రశ్నించలేకుండా పవర్ చూపించే కేటీఆర్ అండ్ కో హైకోర్టు వేసిన ప్రశ్నలకు ఏమని బదులిస్తారో?