Begin typing your search above and press return to search.

ఆ రాష్ట్ర సీఎం సన్నిహిత ఐఏఎస్ కు భారీగా తలంటిన హైకోర్టు

By:  Tupaki Desk   |   13 Jun 2022 4:35 AM GMT
ఆ రాష్ట్ర సీఎం సన్నిహిత ఐఏఎస్ కు భారీగా తలంటిన హైకోర్టు
X
ఎంతటి స్థానంలో ఉన్న వారైనా సరే..న్యాయస్థానాల ముందుకు వచ్చినప్పుడు కాస్తంత ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిందే. అందుకు భిన్నంగా తమకు తోచినట్లుగా వ్యవహరిస్తే తిట్లు ఖాయం. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారికి తాజాగా ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. సదరు ఐఏఎస్ అధికారికి ఉన్న పేరు ప్రఖ్యాతులు అన్ని ఇన్ని కావు. ఆ మాటకు వస్తే.. సదరు అధికారి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడిగా పేరుంది.

అయితే.. మాత్రం ఇలాంటివి ఏవైనా సరే కోర్టు బయటనే. న్యాయమూర్తి ఎదుట ఉన్నప్పుడు రూల్ బుక్ ను పక్కాగా ఫాలో కావాల్సిందే. అలా కాకుండా చేసిన సదరు ఐఏఎస్ అధికారికి తలబొప్పి కట్టిన పరిస్థితి. ఇదంతా బిహార్ రాష్ట్ర హైకోర్టు (పాట్నా)లో చోటు చేసుకుంది.

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు అత్యంత సన్నిహితుడిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఆనంద్ కిశోర్ కు పేరుంది. ఒక కేసు విచారణ నిమిత్తం ఆయన పాట్నా హైకోర్టు ఎదుట హాజరయ్యారు. అయితే.. ఈ సందర్భంగా ఆయన షర్టు బటన్స్ పెట్టుకోకుండా.. షర్ట్ మీద బ్లేజర్ ధరించకుండా హాజరయ్యారు. దీనిపై స్పందించిన జస్టిస్ పీబీ బజంత్రి తీవ్రంగా మండిపడ్డారు. కోర్టులో ఎలాంటి డ్రెస్ కోడ్ ఉంటుందన్న విషయం తెలీదా? ఐఏఎస్ కు ఎంపికయ్యాక శిక్షణకు వెళ్లారా? లేదా? ఇదేమైనా సినిమా హాల్ అనుకున్నారా? అంటూ రెండు నిమిషాలపాటు మండిపడ్డారు.

హైకోర్టు న్యాయమూర్తి ఆగ్రహంతో ఐఏఎస్ అధికారి ఆనంద్ కిశోర్ సమాధానం చెప్పేందుకు తడబడ్డారు. 'కోర్టుల్లో ఎలాంటి డ్రెస్ కోడ్ ఉంటుందో వారు మీకు చెప్పలేదా? ఇదేం బాగోలేదు. ఏంటిది? బిహార్ ఐఏఎస్ ల విషయంలో ఏం జరుగుతోంది? కోర్టుకు ఎలా హాజరు కావాలో వీళ్లకు తెలీదా?' అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

దీనికి బదులిస్తూ.. తాము కోర్టుల్లో ధరించే సాధారణ డ్రెస్ గా పేర్కొన్నారు. సాధారణ డ్రెస్ అంటే కనీసం కోట్ ఉండదా? అని ప్రశ్నించిన ఆయన.. కాలర్ కూడా ఓపెన్ గా ఉంచకూడదు కదా? అంటూ సదరు అధికారి లోపాన్ని క్వశ్చన్ చేశారు.

ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన ఒక ఐఏఎస్ అధికారికి హైకోర్టులో ఎదురైన తాజా అనుభవం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాన్ఫిడెన్సు ఉండొచ్చు.. కానీ అది శ్రుతి మించితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయన్న దానికి తాజా ఉదంతం ఒక ఉదాహరణగా చెప్పక తప్పదు.