Begin typing your search above and press return to search.

అమరావతి రాజధానిపై హైకోర్టు సంచలన ప్రశ్నలు

By:  Tupaki Desk   |   27 Nov 2020 12:00 PM IST
అమరావతి రాజధానిపై హైకోర్టు సంచలన ప్రశ్నలు
X
ఏపీ రాజధాని అమరావతిపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీ ప్రభుత్వం వాదనకు బలం చేకూరేలా వ్యాఖ్యనించింది. అసెంబ్లీ తీర్మానం ద్వారా అమరావతిని రాజధానిగా నిర్ణయించినప్పుడు.. అదే శాసనసభకు రాజధానిని మార్చే అధికారం ఎందుకు ఉండదని హైకోర్టు ప్రశ్నించింది.

రాజధానిని నిర్ణయించే విషయంలో కేంద్రానికి, రాష్ట్రానికి అధికారం ఉన్నట్లు పునర్విభజన చట్టం, సీఆర్‌డీఏ చట్టాల్లో ఎక్కడా చెప్పలేదని హైకోర్టు గుర్తు చేసింది. అలాంటప్పుడు అమరావతిని రాజధానిగా ఎలా నిర్ణయించారని ప్రశ్నించింది. పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాల బిల్లులు ఆమోదం పొందే సమయంలో శాసన మండలిలో చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించిన రికార్డులు, వీడియో ఫుటేజీని వెంటనే కోర్టుకు సమర్పించాలని శాసనసభ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది.

అమరావతిపై హైకోర్టులో దాఖలైన పలు పిటీషన్లను హైకోర్టు విచారించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం అమరావతిని రాజధానిగా నిర్ణయించారని, ఇప్పుడు రాజధానిని మార్చాలంటే పునర్విభజన చట్టానికి సవరణ చేయాల్సిందేనన్నారు. మూడు రాజధానుల ఏర్పాటు వల్ల రైతులకిచ్చిన హామీలను ఉల్లంఘించినట్లవుతుందన్నారు.

శానససభలో తీర్మానం చేయడం ద్వారా అమరావతిని రాజధానిగా నిర్ణయించారని పిటీషనర్ పేర్కొనగా.. మరి రాజధానిని నిర్ణయించడానికి శాసనసభకు అధికారం ఉన్నప్పుడు, దానిని మార్చే అధికారం కూడా శాసనసభకు ఉంటుంది కదా? అని ధర్మాసనం సందేహం వ్యక్తం చేస్తూ తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది.