Begin typing your search above and press return to search.

ఏపీలో గణేష్ ఉత్సవాలపై హైకోర్టు సంచలన నిర్ణయం

By:  Tupaki Desk   |   8 Sep 2021 12:47 PM GMT
ఏపీలో గణేష్ ఉత్సవాలపై హైకోర్టు సంచలన నిర్ణయం
X
గణేష్ ఉత్సవాలు.. ఇప్పుడు ఏపీలో రాజకీయ వేడిని రగిలించాయి. ఏపీ ప్రభుత్వం బహిరంగంగా గణేష్ మండపాలు, ఉత్సవాలను కోవిడ్ నిబంధనల కారణంగా నిషేధించింది. దీంతో ఏపీ ప్రభుత్వంపై అటు బీజేపీ, టీడీపీ, తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. వెంటనే గణేష్ ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని.. ఇతర రాష్ట్రాల్లో వలే ఏపీలోనూ అనుమతించాలని డిమాండ్ చేశారు. ఇది రాజకీయంగా వేడి రగిల్చింది.

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు గణేష్ ఉత్సవాలను కోవిడ్ నిబంధనల పేరిట అనుమతి నిరాకరించిన ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఏపీలోని ప్రైవేటు స్థలాల్లో బయట వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వినాయక చవితి ఉత్సవాల దాఖలైన లంచ్ మోషన్ పిటీషన్ పై హైకోర్టు ఈ మేరకు సంచలన తీర్పునిచ్చింది.

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వినాయక పూజలకు అనుమతించాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రైవేటు స్థలాల్లో గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవచ్చునని హైకోర్టు స్పష్టం చేసింది. ఆర్టికల్ 26తో ప్రజలకు మతపరమైన కార్యక్రమాల నిర్వహణకు అధికారం ఉంటుందని.. నిరోధించే హక్కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది.

అయితే కోవిడ్ నిబంధనల మేరకు పూజలు చేసుకోవాలని ప్రజలకు హైకోర్టు సూచించింది. ఒకేసారి ఐదుగురికి మించకుండా పూజలు నిర్వహించుకోవచ్చునని వెల్లడించింది. మరోవైపు పబ్లిక్ స్థలాల్లో ఉత్సవాలు నిర్వహించడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలను సమర్థించింది. ప్రైవేటు స్థలాల్లో కేవలం విగ్రహాల ఏర్పాటుకు అనుమతించాలని ఆదేశాల్చింది.