Begin typing your search above and press return to search.

ఉన్నతాధికారులకు హైకోర్టు ఊరట

By:  Tupaki Desk   |   24 Aug 2021 7:54 AM GMT
ఉన్నతాధికారులకు హైకోర్టు ఊరట
X
తెలంగాణ ఉన్నతాధికారులకు ఊరట లభించింది. వారిపై కోర్టు ధిక్కరణ కింద పడిన శిక్షలు , జరిమానాల నుంచి తెలంగాణ హైకోర్టు విముక్తి ప్రసాదించింది. తెలంగాణ ఉన్నతాధికారులపై కోర్టు ధిక్కరణ ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఓ కేసుకు సంబంధించి అటవీశాఖ ఉన్నతాధికారులతోపాటు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు విధించిన శిక్ష కేసులో అప్పీల్కు అనుమతిస్తూ కోర్టు ధిక్కరణ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది.

సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై అధికారులు అప్పీల్ చేసుకునేందుకు చీఫ్ జస్టిస్ తో కూడిన ద్విసభ్య బెంచ్ అనుమతించింది. దీంతో అధికారులు జైలు పాలు కాకుండా గొప్ప ఊరట లభించినట్టైంది.

2009కి చెందిన ఓ కేసులో కోర్టు ఉత్తర్వులను అమలు చేయడం లేదంటూ ఈనెల మొదటి వారంలో సింగిల్ జడ్జి ఉన్నతాధికారులకు ఆరునెలల జైలు, రెండు వేల రూపాయల జరిమానా విధించారు.

తెలంగాణ అటవీశాఖ ప్రధాన కార్యదర్శి ఏ. శాంతికుమారి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, పీసీసీఎప్ఆర్ శోభ, రంగారెడ్డి సీసీఎఫ్ సునీతా భగవత్ తదితరులు గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారనేది అభియోగం.

ఈ కేసుకు సంబంధించి ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు కోర్టుకు హాజరు కావడంతోపాటు ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలను వివరించారు. అలాగే అప్పీలుదారు కోర్టు ధిక్కరణ కోసం పిటీషన్ వేసే గడువు కూడా ముగిసిపోయిందని వాదించారు. అందువల్ల ఇది కోర్టు ధిక్కరణ పరిధిలోకి రాదని.. తమను శిక్ష నుంచి మినహాయించి అప్పీలుకు అవకాశం ఇవ్వాలనే ఉన్నతాధికారుల పిటీషన్ ను హైకోర్టు అనుమతించింది.