Begin typing your search above and press return to search.

డెంగీ జ్వరాలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.. ఎంతలా ఫైర్ అయ్యిందంటే?

By:  Tupaki Desk   |   24 Oct 2019 9:33 AM GMT
డెంగీ జ్వరాలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.. ఎంతలా ఫైర్ అయ్యిందంటే?
X
డెంగీ జ్వరాలతో విలవిలలాడిపోతున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. డెంగీ జ్వరాలపై భారీ ఎత్తున మీడియాలో వార్తలు రావటంతో ప్రభుత్వం ఇరుకున పడిన పరిస్థితి. ఇదే సమయంలో అనూహ్యంగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె అంశం తెర మీదకు రావటంతో డెంగీ సమస్య తెర వెనక్కి వెళ్లింది. మీడియాలో కనిపించని ఈ సమస్య.. తెలంగాణ ప్రజల్ని మాత్రం వదల్లేదు.

హైదరాబాద్ మహానగరంలో ప్రతి ఇంట్లో ఒకరిద్దరైనా జ్వరం బారిన పడితే.. మూడు వంతుల్లో ఒక వంతు హైదరాబాద్ లో డెంగీ జ్వరాలతో ఇబ్బందులకు గురైనట్లు చెబుతున్నారు. ఒక్క హైదరాబాద్ లో మాత్రమే కాదు.. తెలంగాణలోని మిగిలిన జిల్లాల్లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఇదిలా ఉంటే.. డెంగీ జ్వరాల్ని నియంత్రించటంతో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారించిన న్యాయస్థానం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

ప్రజలు చనిపోతున్నా ప్రభుత్వం స్పందించలేదంటూ ఫైర్ అయిన న్యాయస్థానం.. ఎలాంటి చర్యలు తీసుకోవాలో తమకు చెప్పాలంటూ ఉన్నతాధికారులకు ఆదేశాలుజారీ చేసింది. దీంతో.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి.. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్.. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్.. వైద్య సంచాలకులు రమేశ్ రెడ్డి.. ఫీవర్ ఆసుపత్రి సూపరిండెంట్ శంకర్ లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి అధికారులు కోర్టుకు తెలిపారు. దీనిపై కోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేసింది. డెంగీ నివారణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు అంతంతమాత్రంగానే ఉన్నాయని పేర్కొంది. అధికారులు తీసుకున్న చర్యలు కేవలం కాగితాల మీదనే కనిపిస్తున్నాయన్న కోర్టు.. హైకోర్టు పక్కనే ఉన్న మూసీని చూస్తే.. ఎలాంటి పరిస్థితి ఉందో అర్థమవుతుందన్నారు.

కింది స్థాయిలో పరిస్థితి బాగోలేదని.. డెంగీ కారణంగా మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం రూ.50 లక్షలు చొప్పున చెల్లించాలని వ్యాఖ్యానించింది. ప్రజల సంక్షేమం చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది.. అధికారులదేనని స్పష్టం చేసిన హైకోర్టు.. పరిస్థితి బాగుంటే ప్రజలు కోర్టు వరకూ ఎందుకు వస్తారని ప్రశ్నించింది. ఇంత తీవ్రస్థాయిలో ఒక అంశంపై హైకోర్టు ప్రభుత్వాన్ని.. అధికారుల్ని తలంటటం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి అని అంటున్నారు.