Begin typing your search above and press return to search.

రేపట్నుంచి స్కూళ్లు ప్రారంభించవద్దు: హైకోర్టు ఆదేశాలు !

By:  Tupaki Desk   |   31 Aug 2021 1:00 PM IST
రేపట్నుంచి స్కూళ్లు ప్రారంభించవద్దు: హైకోర్టు ఆదేశాలు !
X
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి స్కూళ్లు, కాలేజీలను తప్పనిసరిగా తెరవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ,రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో స్కూళ్లు తెరవడం తప్పనిసరి కాదు అని తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. అలాగే సెప్టెంబర్ 1 నుండి స్కూల్స్ ఓపెన్ అంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే విధించింది. కరోనా థర్డ్ వేవ్ నేపధ్యంలో ప్రత్యక్ష బోధన వద్దని దాఖలైన పిటిషన్‌ను విచారించిన కోర్టు, వారం పాటు స్కూల్స్ ప్రారంభం పై స్టే ఇచ్చింది.

అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాలు, హాస్టల్స్ తెరవొద్దని ఆదేశించింది.

స్కూల్స్ రావాలని విద్యార్ధులను బలవంతం చేయకూడదని హైకోర్టు తెలిపింది. అలాగే ప్రత్యక్ష తరగతులకు హాజరు కాని విద్యార్ధులపై చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాన్ని బట్టీ... ఇప్పుడు తమ పిల్లల్ని స్కూళ్లకు పంపాలా లేదా అన్నది తల్లిదండ్రుల ఇష్టంగా మారింది. హైకోర్టు ప్రభుత్వ ఆదేశంపై స్టే విధించడం వల్ల ఇప్పుడు తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లు లేదా ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు ఏవైనా సరే, పిల్లల్ని బలవంతంగా స్కూళ్లకు పంపమని డిమాండ్ చేసే, బలవంతం చేసే ఛాన్స్ లేదు. కాబట్టి తమ పిల్లల్ని పంపాలి అని అనుకుంటే తల్లిదండ్రులు పంపుకుంటారు, వద్దు అనుకుంటే ఆన్‌ లైన్‌ క్లాసులు చదివించుకుంటారు.

హైకోర్టు వారం పాటూ స్టే విధించింది కాబట్టి వారం తర్వాత మళ్లీ ఈ అంశంపై విచారణ జరిపే అవకాశం ఉంది. తెలంగాణలో కరోనా కేసులు తక్కువగానే నమోదవుతున్నాయి. ఇదివరకు ఒక్క హైదరాబాద్‌లోనే 500 కొత్త కేసులు వచ్చేవి... ఇప్పుడు మొత్తం రాష్ట్రమంతా చూసినా 400 కంటే తక్కువ కేసులే వస్తున్నాయి. అందువల్ల ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి ఫిజికల్ క్లాసులు ప్రారంభించాలని అనుకుంది. దానికి తోడు పిల్లల్లో మానసిక సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉండటం వల్ల స్కూళ్లు తెరవడమే మంచిదని భావించింది. అందువల్ల సెప్టెంబర్ 1 నుంచి తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లల్ని స్కూళ్లకు పంపాలని కండీషన్ పెట్టింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో హైకోర్టు ఈ స్టే విధించింది. ప్రభుత్వం చెప్పడమైతే చెప్పింది కానీ... స్కూళ్లలో కరోనా జాగ్రత్తలు ఎంతవరకూ తీసుకుంటున్నారనే అంశం సమస్యగా మారింది. ప్రభుత్వమేమో అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామని చెబుతున్నా, తల్లిదండ్రులలో ఉన్న భయాల్ని మాత్రం పోగొట్టలేకపోయింది. దీనితో హైకోర్టు దీనిపై స్టే ఇచ్చింది.