Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ కు భారీగా ధ‌ర్నాచౌక్ పంచ్ ఇచ్చిన హైకోర్టు!

By:  Tupaki Desk   |   19 Sep 2018 5:42 AM GMT
కేసీఆర్‌ కు భారీగా ధ‌ర్నాచౌక్ పంచ్ ఇచ్చిన హైకోర్టు!
X
ఉద్య‌మ నేత.. రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా మారితే? పాల‌న స‌రికొత్త పుంత‌లు తొక్క‌టం ఖాయ‌మ‌న్న భావ‌న అంద‌రిలో ఉంటుంది. కానీ.. అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించిన కేసీఆర్ స‌ర్కారు నాలుగున్న‌రేళ్ల పాల‌న‌లో ఆయ‌న తీసుకున్న ఎన్నో నిర్ణ‌యాల‌పై కోర్టులు తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌టం తెలిసిందే. తాజాగా.. అదే త‌ర‌హాలో హైకోర్టు ఘాటు వ్యాఖ్య చేసింది.

ప్ర‌జాస్వామ్యంలో అధికార‌ప‌క్షంపై నిర‌స‌న‌ను వ్య‌క్తం చేసేందుకు ప్రాధాన్య‌త ఇస్తారు. ప్ర‌భుత్వం చేసే త‌ప్పుల్ని ఎత్తి చూపే వేదిక‌లు చాలా అవ‌స‌రం. కానీ.. అందుకు భిన్న‌మైన తీరును ప్ర‌ద‌ర్శించ‌టం కేసీఆర్ కు అల‌వాటే. త‌న‌పైనా.. తన ప్ర‌భుత్వం పైనా విమ‌ర్శ‌లు చేసే వారి విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌ట‌మే కాదు.. విమ‌ర్శ‌ల‌కు.. నిర‌స‌న‌ల‌కు ఏ మాత్రం అవ‌కాశం ఇవ్వ‌టానికి ఇష్ట‌ప‌డ‌ని కేసీఆర్ తీరును తాజాగా హైకోర్టు క‌డిగిపారేసింది.

ప్ర‌భుత్వ విధానాల‌పై త‌మ‌కున్న నిర‌స‌న‌ను తెలియ‌జేసేందుకు హైద‌రాబాద్‌లో ధ‌ర్నా చౌక్ ను అంద‌రూ వినియోగించ‌టం తెలిసిందే. ఆ మాట‌కు వ‌స్తే.. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్య‌మంత్రిగా సీఎం ప‌ద‌విని చేప‌ట్టానికి కేసీఆర్ కు అవ‌కాశం ఇచ్చిన వారిలో ధ‌ర్నాచౌక్ పాత్ర ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. స‌మైక్య‌పాల‌న‌లో నాటి ప్ర‌భుత్వ విధానాల్ని తీవ్రంగా తూర్పార ప‌ట్టే ప‌ని ధ‌ర్నాచౌక్ లో పెద్ద ఎత్తున జ‌రిగేది. తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌లో అంత కీల‌క పాత్ర పోషించిన ధ‌ర్నా చౌక్ ను ఇందిరా పార్కు నుంచి తొల‌గించి.. ఎక్క‌డో న‌గ‌ర శివారులో ఏర్పాటు చేయాలంటూ కేసీఆర్ స‌ర్కారు నిర్ణ‌యించింది.

దీనిపై హైకోర్టులో కేసు న‌డుస్తోంది. తాజాగా ఈ కేసు విచార‌ణ సంద‌ర్భంగా హైకోర్టు ధ‌ర్మాసం చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగానే కాదు.. ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు ఊహించ‌ని షాక్ గా మారాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అడ‌వుల్లో సెల్ ట‌వ‌ర్లు ఏర్పాటు చేస్తే ప్ర‌యోజ‌నం ఏం ఉంటుంది? అక్క‌డున్న పులులు.. సింహాలు.. ఇత‌ర జంతువులు సెల్ ఫోన్లు వాడ‌వు.. ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండేలా ట‌వ‌ర్లు ఏర్పాటు చేయాలి.. అలానే ధ‌ర్నాలు ప్ర‌జ‌ల్లో కాకుండా రుషికేష్ వంటి దూర‌ప్రాంతాల్లో చేయాలా? అంటూ ఘాటు వ్యాఖ్య చేసింది.

అంతేకాదు.. ధ‌ర్నా చౌక్ కోసం ప్ర‌భుత్వం గుర్తించిన ప్రాంతాలు ఏవి? అక్క‌డ క‌ల్పించిన సౌక‌ర్యాల వివ‌రాల్ని రెండు వారాల్లో కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని కోరింది. ప్ర‌జాస్వామ్య భార‌తంలో నిర‌స‌న గ‌ళాల్ని అణ‌చివేస్తామంటూ అంగీక‌రించ‌మ‌ని స్ప‌ష్టం చేసింది. ధ‌ర్నా చౌక్ ను మారుస్తూ కేసీఆర్ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యంపై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వి.హ‌నుమంత‌రావు ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యం వేశారు. దీనిపై విశ్రాంత ఆచార్యులు వివ్వేశ్వ‌ర‌రావు రాసిన లేఖ‌ను హైకోర్టు సుమోటోగా తీసుకొని ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యంగా విచార‌ణ‌ను షురూచేసింది. పిటిష‌నర్ త‌ర‌ఫు న్యాయ‌వాదిగా సి. దామోద‌ర్‌రెడ్డి వాద‌న‌లు వినిపించారు.

సుదీర్ఘ కాలంగా ఇందిరాపార్కు వ‌ద్ద‌నున్న ధ‌ర్నా చౌక్ ద‌గ్గ‌ర బ‌హిరంగ స‌భ‌లు.. ధ‌ర్నాలు అనుమ‌తించ‌క‌పోవ‌టం స‌రికాద‌ని వాదించారు. దీనికి కౌంట‌ర్ ఇస్తూ అద‌న‌పు అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ జె. రామ‌చంద్ర‌రావు వాద‌న‌లు వినిపిస్తూ.. ధ‌ర్నాల కార‌ణంగా ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు క‌లుగుతుండ‌టంతో ఆందోళ‌న‌ల‌కు అనుమ‌తి ఇవ్వ‌టం లేద‌న్నారు. నిర‌స‌న‌ల కోసం శంషాబాద్‌.. శామీర్ పేట‌.. జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్‌.. మేడిప‌ల్లి ప్రాంతాల‌ను ఎంపిక చేసిన‌ట్లు పేర్కొన్నారు. ఈ ద‌శ‌లో జోక్యం చేసుకున్న ధ‌ర్మాస‌నం.. ఇందిరా పార్కు వ‌ద్ద నిర‌స‌న‌లు తెల‌ప‌రాద‌న‌టం స‌రికాద‌ని.. ఒక‌వేళ ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు ఎదుర‌వుతాయంటే ఆంక్ష‌లు విధించాల‌న్నారు. న‌గ‌రానికి 50 కిలోమీట‌ర్ల దూరంలో నిర‌స‌న‌లు వ్య‌క్తం చేయ‌టం ఏ మాత్రం సమంజ‌సమంటూ నిల‌దీసింది. ఏడాది క్రితం దాఖ‌లు చేసిన పిటిష‌న్ లో ఇప్ప‌టివ‌ర‌కూ కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌క‌పోవ‌టం ఏమిటంటూ త‌ప్పు ప‌ట్టింది. ధ‌ర్నా చౌక్ పై కేసీఆర్ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యంపై హైకోర్టు తాజా వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి.