Begin typing your search above and press return to search.

కేసీఆర్ పొలిటికల్ గేమ్ లో ఈయన బలి.?

By:  Tupaki Desk   |   16 Feb 2019 7:54 AM GMT
కేసీఆర్ పొలిటికల్ గేమ్ లో ఈయన బలి.?
X
తెలంగాణ రాష్ట్ర మాజీ స్పీకర్‌ మధుసుధానాచారికి టైం బాగోలేనట్లు కనిపిస్తోంది. డిసెంబర్‌ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఘోర పరాజయం చెందారు. ఇప్పటికీ ఆ ఓటమి నుంచి తేరుకోకముందే ప్రస్తుతం ఆయన కోర్టు నుంచి సమన్లు అందుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల శాసనసభ్యత్వ రద్దు విషయంలో కేసీఆర్ పట్టుకు ఆయన మౌనంగా ఉండిపోవడం ఇప్పుడు కష్టాలు తెచ్చిపెట్టింది. ఏకంగా కోర్టు ధిక్కారం కింద ఆయన జైలుకు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్‌ ప్రసంగంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి - సంపత్‌ లు ఆందోళన నిర్వహించారు. గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. ఈక్రమంలో కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి హెడ్‌ సెట్‌ ను పోడియం వైపు విసిరేయడంతో శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ కు తగిలింది. దీంతో ఆయన కన్ను దెబ్బతిందని ఆసుపత్రిలో చేర్చారు. అంతేకాకుండా రాత్రికి రాత్రే గెజిట్‌ తెచ్చి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి - సంపత్‌ల శాసనసభ్యత్వాన్ని రద్దు చేశారు.

తమ శాసనసభ్యత్వాల రద్దు విషయంలో సహజ న్యాయసూత్రాలు పాటించలేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి - సంపత్‌ లు అప్పట్లో హైకోర్టును సంప్రదించారు. అయితే ఈ వ్యవహారంపై సాక్షాలు సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని కోరింది. కానీ అప్పుడు సాక్ష్యాలు సమర్పించపోవడంతో వారి శాసనసభ్యత్వాలను పునరుద్దరించాలని స్పీకర్‌ను ఆదేశించింది. కానీ ఈ విషయాన్ని స్పీకర్‌ పట్టించుకోలేదు. దీంతో ఈ కేసు విచారణ సందర్భంగా ప్రతివాదిగా స్పీకర్‌ ను చేసి సమన్లు జారీ చేసింది. ఇప్పుడు కూడా హాజరుకాకపోతే అరెస్టు చేయడానికి వెనుకాడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.

వాస్తవానికి అసెంబ్లీ - న్యాయశాఖ కార్యదర్శులు ధర్మాసనం ముందు హాజరై పూచీకత్తుతో విడుదలయ్యారు. స్పీకర్‌ మాత్రం ఇప్పటి వరకు నోటీసులు పంపించినా పట్టించుకోకపోవడంతో కోర్టు ఈ విషయాన్ని సీరియస్‌ గా తీసుకుంది. అప్పట్లో కాంగ్రెస్‌ నాయకులను శాసనసభలోకి రానివ్వద్దనే ఉద్దేశంలో కేసీఆర్‌ వేసిన ప్లాన్‌ తాత్కాలికంగా సక్సెస్‌ అయింది. అయితే ఎటోచ్చి మళ్లీ ఈ వ్యవహారం స్పీకర్‌ మీద పడడంతో ఇప్పుడు ఆయన బోను ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. దీంతో ఈ కేసు విషయంలో మాజీ స్పీకర్‌ను కేసీఆర్‌ ఎలా కాపాడుతాడో చూడాలి..