Begin typing your search above and press return to search.

వివేకా హత్య కేసులో బాబు కి నోటీసులిచ్చిన హైకోర్టు !

By:  Tupaki Desk   |   9 Jan 2020 9:19 AM GMT
వివేకా హత్య కేసులో బాబు కి నోటీసులిచ్చిన హైకోర్టు !
X
మాజీ మంత్రి, సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వివేకా వివేకానందరెడ్డి హత్య కేసులో మాజీ సీఎం చంద్రబాబుకు హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్‌ తదితరులకు కూడా నోటీసులు జారీ చేస్తూ పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించిన కోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 20కు వాయిదా వేసింది.

అలాగే అప్పటివరకు ఈ కేసులో సంబంధిత కోర్టులో తుది నివేదిక దాఖలు చేయబోమన్న ఏజీ శ్రీరామ్‌ హామీని హైకోర్టు నమోదు చేసుకుంది. దర్యాప్తును యథాతథంగా కొనసాగించవచ్చని సూచిస్తూ సౌభాగ్యమ్మ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి ఉత్తర్వులిచ్చారు. హత్య కేసు దర్యాప్తును సీబీఐ కి అప్పగించాలని ప్రతిపక్ష నాయకుడి హోదాలో వైఎస్‌ జగన్, వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, ఇదే అభ్యర్థనతో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేయడం అందరికి తెలిసిందే.

ఈ కేసు దర్యాప్తు చాలా కీలక దశ లో ఉందని ఏజీ చెప్పారు. ఆదినారాయణ రెడ్డి, బీటెక్‌ రవిలకు ఏదో ఇబ్బంది ఉందని, వారిని విచారణకు పిలిపిస్తున్నామన్న కారణంతో సీబీఐ దర్యాప్తునకు అప్పగించాలని కోరుతున్నారని కోర్టుకి తెలియజేసారు. అయితే గతేడాది మార్చి 15న పులివెందులలోని స్వగృహంలో దారుణ హత్యకు గురయ్యారు వైఎస్ వివేకా. మొదట ఆయన గుండెపోటుతో మరణించారని అనుకున్నప్పటికీ.. పోస్ట్‌మార్టంలో హత్యగా తేలింది. ఈ హత్య రాజకీయంగా అప్పట్లో సంచలనం సృష్టించింది.