Begin typing your search above and press return to search.

రోజా మళ్లీ అసెంబ్లీకి...

By:  Tupaki Desk   |   17 March 2016 11:43 AM IST
రోజా మళ్లీ అసెంబ్లీకి...
X
వైసీపీ ఎమ్మెల్యే రోజాకు హైకోర్టులో ఊరట లభించింది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై సభకు రాకుండా ఆమెపై ఏడాది పాటు సస్పెన్షన్‌ విధించిన సంగతి తెలిసిందే.. దీనిపై ఎమ్మెల్యే రోజా హైకోర్టును ఆశ్రయించగా దానిపై నిన్న విచారణ సాగింది... కేసు ఈ రోజుకు వాయిదా పడగా ఉదయాన్నే విచారణ కొనసాగింది. ఆమెపై విధించిన సస్పెన్షన్‌ తీర్మానాన్ని కొట్టివేస్తూ సస్పెన్షన్‌ ఎత్తివేయాలని ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు.

కాగా తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు రోజా మళ్లీ అసెంబ్లీకి హాజరు కావొచ్చు. దీంతో రోజా విషయంలో ఏపీ ప్రభుత్వం దెబ్బతిన్నట్లయింది. అసెంబ్లీలో తమను తెగ ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వంపై విపక్ష వైసీపీ భారీ విజయం సాధించినట్లుగానే దీన్ని పరిగణించాల్సి ఉంటుంది.

కాగా తాజా ఉత్తర్వుల నేపథ్యంలో రోజా విలేకరులతో మాట్లాడుతూ ఇది తన ఒక్కరి విజయం కాదని.. తన వెన్నంటి ఉన్న తన నియోజకవర్గ ప్రజల విజయమని చెప్పారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాడడం కొనసాగిస్తానని... వెనుకాడే ప్రసక్తే లేదని చెప్పారు. కాగా రోజాకు అనుకూలంగా తీర్పు రావడంపై వైసీపీలో పెద్ద ఎత్తున హర్షం వ్యక్తమవుతోంది. ఇది చంద్రబాబుకు చెంపపెట్టని వైసీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు.