Begin typing your search above and press return to search.

హైకోర్టు జడ్జి చెప్పారని ఆ ఇంట్లో టెస్టు చేస్తే..షాకింగ్ నిజం

By:  Tupaki Desk   |   7 Jun 2020 4:28 AM GMT
హైకోర్టు జడ్జి చెప్పారని ఆ ఇంట్లో టెస్టు చేస్తే..షాకింగ్ నిజం
X
ఒక పలుకరింపు షాకింగ్ నిజం బయటకు వచ్చేలా చేసింది. తెలంగాణలో తాజా పరిస్థితి ఏమిటన్న దానిపై సరికొత్త సందేహాలు కలిగే ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. దేశంలోని చాలా రాష్ట్రాలతో పోలిస్తే.. మాయదారి రోగంపై సందేహంతో పరీక్షలు చేయాలన్న వారికి.. అక్కర్లేదంటూ.. ఆచితూచి మాత్రమే పరీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంట్లో ఎవరికైనా పాజిటివ్ వచ్చినా.. ఎలాంటి రోగ లక్షణాలు లేకుంటే పరీక్షలు చేయట్లేదన్న విషయం తెలిసిందే.

ఇలాంటి తీరు ఏ మాత్రం సరికాదన్న అభిప్రాయానికి వచ్చేలా తాజా ఉదంతం ఒకటి బయటకు వచ్చింది. తెలంగాణ హైకోర్టులో ఒక ఉద్యోగిని.. ఒక న్యాయమూర్తి పలుకరించారు. మీ ఇంట్లో అంతా బాగున్నారా? అని ఆయన ఆరా తీశారు. మా అన్నయ్యకు ఆస్తమా ఉంది.. ఈ మధ్యన కాస్త ఇబ్బంది పడుతున్నాడని సదరు ఉద్యోగి సమాధానమిచ్చాడు. ఎందుకైనా మంచిది.. నేను చెబుతాను.. అతడికి పరీక్షలు చేయమని.. అంటూ చెప్పి వెళ్లిపోయారా హైకోర్టు జడ్జి.

ఆయన చెప్పినట్లే.. అధికారులు సదరు ఉద్యోగి సోదరుడికి పరీక్షలు చేశారు. అదే సమయంలో ఇంట్లో వారంతా కూడా తమకు సందేహాలు ఉన్నాయని చెప్పారు. దీంతో.. ఇంట్లో ఉన్న పద్నాలుగు మందికి టెస్టులు చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో ట్విస్టు ఏమంటే.. తర్వాత వచ్చిన రిజల్ట్. మొత్తం పద్నాలుగుమందికి పరీక్షలు చేస్తే.. అందులో ఏడుగురికి పాజిటివ్ గా తేలటం. దీంతో.. వారందరిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఖైరతాబాద్ లోని చింతల్ బస్తీలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ.. సదరు హైకోర్టు న్యాయమూర్తి పలుకరింపుగా పలుకరించకుంటే? ఇదే పరిస్థితి మరికొద్ది రోజులు సాగి ఉంటే? ఎంతమందికి విస్తరించేదో? మరెన్ని పాజిటివ్ లకు కారణమయ్యోదో అన్న భయాందోళనలు కలుగక మానవు.