Begin typing your search above and press return to search.

మంత్రుల ఫోటోలపై హైకోర్టు న్యాయమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   1 Sept 2020 1:20 PM IST
మంత్రుల ఫోటోలపై హైకోర్టు న్యాయమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు
X
కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలు కొన్నిసార్లు ఆసక్తికరంగా ఉంటున్నాయి. తాజాగా చెప్పే అంశం కూడా ఈ కోవకు చెందిందే. కొద్దిరోజుల క్రితం ఏపీ ప్రభుత్వం జారీ చేసే ప్రకటనల విషయంలో చోటు చేసుకుంటున్న అంశాలపై ఒకరు ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయటం తెలిసిందే. తాజాగా ఇదే అంశంపై మరోసారి విచారణ జరిగింది. పిల్ ను ప్రథమ ధర్మాసనం ముందుకు బదిలీ చేయాలని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్.. జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం రిజిస్ట్రీని ఆదేశించింది.

ఇదిలా ఉంటే.. దానికి ముందు ఈ కేసు విచారణ సందర్భంగా పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది.. నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనల్లో పార్టీ రంగులతో పాటు.. దివంగత నేతల ఫోటోను.. మంత్రుల ఫోటోల్ని అదే పనిగా వాడుతున్నారని పేర్కొన్నారు. ఈ వాదనల్ని తప్పు పట్టిన అడ్వకేట్ జనరల్.. పిటిషనర్ రాజకీయ ప్రయోజనం కోసమే కోర్టుకు వచ్చారన్నారు. కేబినెట్ మంత్రుల ఫోటోలు కూడా వేసుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పిందని.. పిటిషనర్ తన పిటిషన్ లో ఆ విషయాల్ని దాచి పెట్టారన్నారు.

ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ కుమార్ వ్యాఖ్యానిస్తూ.. ఏ మంత్రుల ఫోటోలైనా మాటిమాటికీ ప్రచురించటం సరికాదన్నది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. గత ప్రభుత్వాన్ని తాను సమర్థించటం లేదని.. ప్రభుత్వం చేసేది ప్రజలకు తెలిసేలా ఉండాలన్నారు. అంతేకానీ ఫోటోల్ని ప్రచురించాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం చేసిన పనిని ప్రజలకు తెలియజేయాలని.. మంత్రులేమీ హీరోలు కాదు కదా అని పేర్కొన్నారు. మంత్రుల ఫోటోలైనా మాటిమాటికీ ప్రచురించటం సరికాదన్నది తన వ్యక్తిగత అభిప్రాయమంటూ చెప్పిన మాటలు ఆసక్తికరంగా మారాయి.