Begin typing your search above and press return to search.

మీకు కోర్టులంటే లెక్కలేదా?...కేసీఆర్ సర్కార్ పై హైకోర్టు ఆగ్రహం

By:  Tupaki Desk   |   27 July 2020 10:30 AM GMT
మీకు కోర్టులంటే లెక్కలేదా?...కేసీఆర్ సర్కార్ పై హైకోర్టు ఆగ్రహం
X
తెలంగాణలో కరోనా కేసులు సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ప్రతి రోజు దాదాపుగా 1500 కేసులు నమోదవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక, టెస్టులు చేయడానికి...దాని ఫలితాలు రావడానికి ఎక్కువ సమయం పట్టడం ప్రజలను కలవరపెడుతోంది. తెలంగాణలో టెస్టుల సంఖ్య భారీగా పెంచాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నా...ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. కరోనా టెస్టులు, గణాంకాల, నివేదికల విషయంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిని హైకోర్టు కూడా గతంలో తప్పుబట్టింది. కరోనా కేసుల విషయంలో దాఖలైన పలు పిటిషన్ల నేపథ్యంలో కరోనా మహమ్మారి నియంత్రణ వ్యవహారంలో ప్రభుత్వానికి హైకోర్టు గతంలోనే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. కరోనా కేసుల విషయంలో తమ ఆదేశాలను అమలు చేయడం లేదంటూ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం తమ ఆదేశాలు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని, జూన్ 8 నుంచి తాము ఇచ్చిన ఒక్క ఉత్తర్వును కూడా అధికారులు అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఉత్తర్వుల అమలు ఎందుకు కష్టమో తెలపాలని ఆదేశించింది. తెలంగానలో కరోనా కేసులపై దాఖలైన వివిధ పిటిషన్లపై సోమవారం నాడు హైకోర్టు విచారణ చేపట్టింది.

కోర్టులంటే తెలంగాణ ప్రభుత్వానికి గౌరవం లేదని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. గతంలో మాదిరికాకుండా...హైకోర్టు ఆదేశాలతో ఆదివారం నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొత్త నమూనాలో కరోనా బులెటిన్‌ వెల్లడిస్తోంది. అయినప్పటికీ, మెడికల్ హెల్త్ బులిటెన్ లు, కరోనా బులిటెన్ లలో పారదర్శకత లేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నిన్నటి కరోనా కేసుల బులెటిన్‌లో సరైన వివరాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలో ఎక్కువగా కరోనా టెస్టులు ఎందుకు చేయడం లేదని గతంలోనే ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించి మందలించింది. తెలంగాణలోని ప్రభుత్వ, గుర్తింపు పొందిన కోవిడ్ ప్రైవేటు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న బెడ్లు, ఆక్సిజన్ సిలెండర్లు, వెంటిలేటర్ల వివరాలను తాము అడిగినా ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించింది. తెలంగాణలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్స అందుతున్న తీరు,ఫీజుల పైనా హైకోర్టు అసంతృప్తి వెళ్లగక్కింది. కరోనా కేసుల విషయంలో ఏం చేయమంటారో తెలంగాణ సీఎస్‌నే అడిగి తెలుసుకుంటామని, కరోనాపై దాఖలైన కేసులన్నింటి విచారణను జూలై 28కి హైకోర్టు వాయిదా వేసింది. జులై 28న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య, ఆరోగ్య, మునిసిపల్, కార్యనిర్వహణ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు హైకోర్టుకు హాజరు కావాలని గతంలోనే ఆదేశించింది.