Begin typing your search above and press return to search.

కేసీఆర్ స‌ర్కారుకు మ‌ళ్లీ హైకోర్టు వాత‌లు త‌ప్ప‌వా?

By:  Tupaki Desk   |   30 Aug 2021 2:30 PM GMT
కేసీఆర్ స‌ర్కారుకు మ‌ళ్లీ హైకోర్టు వాత‌లు త‌ప్ప‌వా?
X
ఔను! ఇప్ప‌టికే కేసీఆర్ స‌ర్కారుపై తెలంగాణ హైకోర్టు అనేక విష‌యాల్లో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ధ‌ర‌ణి భూముల రిజిస్ట్రేష‌న్ నుంచి క‌రోనా వైద్యం వ‌ర‌కు.. హైకోర్టు అనేక విష‌యాల్లో కేసీఆర్ నిర్ణ‌యాల‌ను త‌ప్పుబ‌ట్టింది. ఇక‌, తాజాగా ఇచ్చిన ద‌ళిత బంధు ప‌థ‌కం జీవోపైనా.. విమ‌ర్శ‌లు చేసింది. ఈ జీవోలో స్ప‌ష్ట‌త లోపించింద‌ని పేర్కొంటూ.. అధికారుల‌ను నేరుగా కోర్టుకు రావాల‌ని.ఆ దేశాలు జారీ చేయాలా? అని ప్ర‌శ్నించింది. అదేస‌మ‌యంలో జీవోల‌ను అస‌లు ప్ర‌జాబాహుళ్యంలో ఎందుకు పెట్ట‌డం లేద‌ని నిల‌దీసింది. ఇలా.. ప్ర‌తి విష‌యంలోనూ హైకోర్టు నుంచి కేసీఆర్ స‌ర్కారుకు.. విమ‌ర్శ‌లు, సూచ‌న‌లు, ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతూనే ఉన్నాయి.

తాజాగా ఇప్పుడు మ‌రో విష‌యంపైనా.. కేసీఆర్ స‌ర్కారుకు రాష్ట్ర హైకోర్టు ఉంచి విమ‌ర్శ‌లు త‌ప్ప‌వ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. సెప్టెంబ‌రు 1 నుంచి రాష్ట్రంలో స్కూళ్ల‌ను తెరిచేందుకు ప్ర‌భు త్వం రెడీ అయింది. క‌రోనా నేప‌థ్యంలో దాదాపు 17 నెల‌లుగా మూసి ఉంచిన స్కూళ్ల‌ను సెప్టెంబ‌రు 1 నుం చి పునః ప్రారంభిస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి జిల్లా విద్యాశాఖ‌ల అధికారుల‌తో భేటీ అయి... పాఠశాల‌ల పునః ప్రారంభంపై చ‌ర్చించారు. అయితే..ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వం నుంచి స్ప‌ష్ట‌త లోపించింది. క‌రోనా ఇంకా స‌మ‌సిపోలేద‌ని.. ముఖ్యంగా చిన్నారుల‌కు క‌రోనా ప్ర‌భావం పొంచి ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

అయితే.. క‌రోనా నేప‌థ్యంలో పాఠ‌శాల‌లు తెరుస్తున్న క్ర‌మంలో ప్ర‌భుత్వం నుంచి మార్గ‌ద‌ర్శ‌కాలు ఇవ్వ‌డం అనేది స‌హ‌జ ప్ర‌క్రియ. అదేస‌మ‌యంలో క‌రోనా వ‌స్తే.. తీసుకునే జాగ్ర‌త్త‌ల‌పైనా.. విద్యాశాఖ‌కు మార్గ‌ద‌ర్శ‌కాలు ఇవ్వాలి. కానీ, కేసీఆర్ స‌ర్కారు మాత్రం ఈ విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి మార్గ‌ద‌ర్శ‌కాలు ఇవ్వ‌లేదు. పాఠ‌శాల‌ల్లో ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి? విద్యార్థుల‌ను ఎలా కాపాడుకోవాలి? విద్యార్థుల సంఖ్య‌ను బట్టి త‌ర‌గ‌తి గ‌దుల‌ను ఎలా నిర్వ‌హించాలి? అనే విష‌యాల‌పై ఇప్ప‌టి వ‌ర‌కు స్ప‌ష్ట‌త ఇవ్వ‌క‌పోవ‌డం త‌ల్లిదండ్రుల్లో ఆందోళ‌న క‌లిగిస్తోంది.

మ‌రోవైపు ఏపీలోనూ పాఠ‌శాల‌లు ఈ నెల 16 నుంచి ప్రారంభించారు. అయితే.. జ‌గ‌న్ స‌ర్కారు ఈ విష‌యంలో బాగానే క‌స‌ర‌త్తు చేసింది. రోజు విడిచి రోజుల త‌ర‌గ‌తుల‌కు పిల్ల‌ల‌ను హాజ‌ర‌య్యేలా చూడ‌డం.. క‌రోనా నిబంధ‌న‌ల‌ను ఖ‌చ్చితంగా అమ‌లు చేయ‌డం వంటివాటిపై మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసిన త‌ర్వాతే పాఠ‌శాల‌ల‌ను ప్రారంభించారు. కానీ, తెలంగాణ‌లో ఇవి పాటించ‌డం లేదు. మ‌రోవైపు ఇప్ప‌టికే ఈ విష‌యంపై దాఖ‌లైన పిటిష‌న్ల‌పై విచార‌ణ చేప‌ట్టిన తెలంగాణ హైకోర్టు ఈ నెల 31 న తీర్పు విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలోకేసీఆర్ స‌ర్కారుకు మ‌రోసారి హైకోర్టు నుంచి ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.