Begin typing your search above and press return to search.

ప్రణయ్ విగ్రహానికి హైకోర్ట్ బ్రేక్..

By:  Tupaki Desk   |   29 Sep 2018 10:19 AM GMT
ప్రణయ్ విగ్రహానికి హైకోర్ట్ బ్రేక్..
X
కుల కుంపట్లలో పరువు హత్యకు గురైన ‘ప్రణయ్’ విగ్రహ ఏర్పాటు వివాదం ఇప్పుడు కోర్టుకు చేరింది. ప్రణయ్ భార్య అమృత వర్షిణి తన భర్త విగ్రహాన్ని మిర్యాల గూడలోని సాగర్ రోడ్డులో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై మారుతీరావు సానుభూతిపరులు - మరికొందరు వ్యతిరేకులు అభ్యంతరం తెలిపి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఈ వివాదం మిర్యాల గూడలో వేడి రాజేస్తోంది.

ఈ వివాదం సద్దుమణగకముందే తాజాగా చిన్న వెంకటరమణారావు అనే వ్యక్తి ప్రణయ్ విగ్రహ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని హైకోర్టును ఆశ్రయించాడు. ఈ మేరకు దాఖలు చేసిన రిట్ పిటీషన్ పై హైకోర్టు జస్టిస్ ఏవీ శేషసాయి ఆదేశాలు జారీ చేశారు. మిర్యాలగూడలో ప్రణయ్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు అన్నిశాఖల అధికారుల అనుమతులు తీసుకోవాలని.. అప్పటి వరకూ పనులు చేపట్టరాదని ఉత్తర్వులిచ్చారు. అంతేకాదు ప్రణయ్ విగ్రహ ఏర్పాటులో కలెక్టర్ - ఎస్పీ - డీఎస్పీ - టూటౌన్ సీఐ - మున్సిపల్ కమిషనర్లకు కూడా నోటీసులు జారీ చేశారు. అంతేకాదు పోలీసులు ఈ విషయమై ప్రణయ్ తండ్రికి కూడా నోటీసులు అందజేయాలని హైకోర్టు సూచించింది. 23న స్వయంగా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.

కాగా ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. మారుతీరావు కార్యాలయం - ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. కబ్జాలు చేసిన భూములు - సుపారీ గ్యాంగ్ కు ఇచ్చిన కోటిరూపాయలు ఎక్కడవనే దానిపై ఆరాతీస్తున్నారు. అంతేకాకుండా ప్రణయ్ హత్యకేసులో ప్రమేయమున్న మిగతా ఆరుగురు నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. రెండు రోజుల పాటు పోలీస్ కార్యాలయంలో విచారించనున్నారు.