Begin typing your search above and press return to search.

జగన్ పై కోడికత్తి దాడి కేసు: ఆ రెస్టారెంట్ ఓనర్ కు హైకోర్టు ఊరట

By:  Tupaki Desk   |   18 Nov 2020 5:05 PM GMT
జగన్ పై కోడికత్తి దాడి కేసు: ఆ రెస్టారెంట్ ఓనర్ కు హైకోర్టు ఊరట
X
ఏపీ హైకోర్టులో విశాఖలోని ఫ్యూజన్ రెస్టారెంట్ ఓనర్ కు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు భారీ ఊరట లభించింది. విశాఖలోని అక్రమ కట్టడాలు కూల్చివేత, ప్రభుత్వ భూముల స్వాధీనంలో భాగంగా ఏపీ సర్కార్ ఇటీవల చర్యలు చేపట్టింది. విశాఖను రాజధానిగా వైసీపీ సర్కార్ నిర్ణయిచండంతో అక్కడ ఆక్రమణలను స్వాధీనం చేసుకుంటోంది.

టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తోడల్లుడు, ప్రత్యూష అసోసియేట్స్ ప్రతినిధి పరుచూరి భాస్కర్ రావుకు షాక్ తగిలింది. ఆయన ఆక్రమణలోని భూములను శనివారం స్వాధీనం చేసుకున్నారు. అగ్రహారంలో ఆయన ఆధ్వర్యంలో 124 ఎకరాల భూమి ఉంది. ఇందులో 64 ఎకరాలు ఆక్రమణకు గురైనట్టు గుర్తించారు. ఈ 64 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. రక్షణ గోడలు, షెడ్లు, గేట్లు కూల్చి వేసి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ భూముల విలువ ఏకంగా 256 కోట్లు ఉంటుందని తేల్చారు.

సిరిపురంలోని ఫ్యూజన్ ఫుడ్స్ అండ్ రెస్టారెంట్ ఉన్న 4.84 ఎకరాల భూమిలో ఆక్రమణలు కూల్చివేసి విశాఖ మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లీజు గడువు ముగిసినా ఖాళీ చేయకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నట్టు గుర్తించారు. చంద్రబాబు సన్నిహితుడు టి. హర్షవర్ధన్ ప్రసాద్ కు చెందిన హోటల్ గా దీన్ని పేర్కొంటున్నారు.

దీంతో మాజీ మంత్రి గంటా, ఫ్యూజన్ రెస్టారెంట్ ఓనర్ హర్షవర్ధన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో దీనిపై విచారించిన కోర్టు ‘యథాతథ స్థితి’(స్టేటస్ కో)ని పాటించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యూష భూముల విషయంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ ఉత్తర్వులు జారీ చేశారు.

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై కోడికత్తి దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావు... ఈయన పనిచేస్తున్న రెస్టారెంట్ ఓనర్ హర్షవర్ధన్ చౌదరి కీలకమన్న ఆరోపణలున్నాయి. దాడి చేసిన శ్రీనివాస్ కు ఆశ్రయం కల్పించింది హర్షవర్ధనే అన్న ఆరోపణలు వచ్చాయి..ఈ నేపథ్యంలోనే హర్షవర్ధన్ ఫ్యూజన్ రెస్టారెంట్ ను ఏపీ సర్కార్ కూల్చడం స్వాధీనం చేసుకోవడం రాజకీయ రంగు పులుముకుంది.