Begin typing your search above and press return to search.

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు

By:  Tupaki Desk   |   16 May 2020 10:15 AM IST
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు
X
ఏపీ సర్కార్ కు హైకోర్టులో వరుసగా చుక్కెదురు అవుతోంది. ఇంగ్లీష్ మీడియం చదువులపై కూడా అడ్డంకులు ఎదురుకాగా.. జగన్ సర్కారు ఇటీవలే వాటిని అధిగమించి ఇంగ్లీష్ మీడియంను మొదలుపెట్టింది. తాజాగా అమరావతి రాజధాని భూములను పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించాలన్న నిర్ణయం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు లో ఎదురుదెబ్బ తగిలింది.

ఏపీలో జగన్ గద్దెనెక్కగానే అమరావతి రాజధాని భూముల్లో జరిగిన మోసాలను తవ్వితీశారు. చంద్రబాబు, టీడీపీ నేతలు భారీగా భూములు కొన్నట్టు అనుమానించి విచారణ జరిపారు. ఈ మేరకు రాజధాని మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేస్తూ గృహ నిర్మాణ జోన్ (ఆర్-5 జోన్) పై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ఆర్-5జోన్ పై ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు నాలుగు వారాల పాటు హైకోర్టు సస్పెండ్ చేసింది. తదుపరి విచారణను జూన్ 17కు వాయిదా వేసింది.

రాజధాని మాస్టర్ ప్లాన్ లో మార్పు చేయాలంటే ప్రజాభిప్రాయ సేకరణ తప్పనిసరి అని పిటీషనర్ వాదించారు. స్థానిక సంస్థలు, గ్రామ కమిటీల అభిప్రాయాలు సేకరించాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు హైకోర్టు ప్రభుత్వ ఉత్తర్వులు సస్పెండ్ చేసింది. అమరావతి రైతులకు అనుకూలంగా హైకోర్టు తీర్పునిచ్చింది.