Begin typing your search above and press return to search.

ఆర్థిక సాయంతో ఆత్మహ్యలను ప్రేరేపిస్తారా? తమిళనాడు సర్కార్ పై హైకోర్టు ఫైర్

By:  Tupaki Desk   |   15 Sept 2020 2:20 PM IST
ఆర్థిక సాయంతో ఆత్మహ్యలను ప్రేరేపిస్తారా? తమిళనాడు సర్కార్ పై హైకోర్టు ఫైర్
X
కరోనా కాలంలో నిర్వహిస్తున్న నీట్ పరీక్షలకు భయపడి తమిళనాడులో ఒకేరోజు ముగ్గురు విద్యార్థులు ఆత్మ‌ హ‌త్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఆత్మ హత్యలపై కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఘాటుగా స్పందించాడు. కరోనా భయంతో కోర్టులకు రాకుండా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా న్యాయ విచార‌ణ‌లు చేస్తున్న గౌరవ న్యాయమూర్తులు.. విద్యార్థులను మాత్రం నీట్ పరీక్షకు హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ప్రభుత్వం, కోర్టులు క్రూరంగా వ్యవహరిస్తున్నాయని సూర్య చేసిన వ్యాఖ్యలపై మద్రాసు హైకోర్టు లో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలైంది. ఈ వ్యవహారం సద్దు మణగకుండానే ఈ ఆత్మహత్యల వ్యవహారం లో హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించడం ఆ ఆత్మహత్యలను ప్రోత్సహించడమేనని హైకోర్టు అభిప్రాయపడింది.

నీట్ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు ఆర్థిక సాయంపై న్యాయవాది సూర్యప్రకాశం మద్రాసు హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో విద్యార్థుల ఆత్మహత్యలు అడ్డుకోలేని విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ పై విచారణ జరిపిన న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడంలో రాజకీయ పార్టీలు, ప్రభుత్వం పోటీ పడడాన్ని తప్పుబట్టింది.పరోక్షంగా విద్యార్థుల్లో ఆత్మహత్యలను ప్రేరేపించేలా ప్రభుత్వ తీరు ఉందని అభిప్రాయ పడింది. ఇలా పోటీపడి ఆర్థిక సాయం చేయడం విద్యార్థుల ఆత్మ హత్యలను ప్రోత్సహించినట్టవుతుందని మద్రాసు హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తాజాగా హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో పళని సర్కార్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.